భయపడుతూ.. ధియేటర్లో సినిమా చూడలేం: ప్రేక్షకులు

సినీ పరిశ్రమకి ఇది చాలా పెద్ద షాక్. ఈ రోజు తెలుగు రాష్ర్టాల్లో సినిమా ధియేటర్లు తెరచుకున్నాయనే మాటే కానీ, ధియేటర్ల దగ్గర పెద్దగా ప్రేక్షకులు కనిపించలేదు. నిన్ననే సినీ నటుడు పోసాని కృష్ణ మురళి కరోనా బారిన పడడం, ఏపీలోనూ అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత కరోనా బారిన పడడం.. ఈ వార్తలు మీడియాలో హైలైట్ అవ్వడం.. వాటికి తోడు సెకండ్ వేవ్ ప్రభావం తగ్గలేదు. తిరిగి కేసులు పెరుగుతున్నాయ్.. అనే నిపుణుల హెచ్చరికలు.. వాటికి సంబంధించిన గణాంకాలు.. ప్రేక్షకుల్ని భయపెట్టేశాయి. సినిమా ధియేటర్లలోనే చూడాలి. కానీ, ఆ అనుభవం కోసం జీవితాన్ని పణంగా పెట్టలేం.. అంటూ ‘తిమ్మరుసు’ సినిమా చూడ్డానికి వచ్చిన ఓ యువతి చెప్పడం గమనార్హం. కొన్ని టికెట్లు తెగాయ్. కానీ, సినిమా నిలదొక్కుకోవాలంటే ఇది సరిపోదు. దీన్నొక ట్రైల్ కోణంలో సినీ పెద్దలు భావిస్తుండొచ్చు.

కానీ, సినిమా ధియేటర్ల భవిష్యత్తు మాత్రం అంధకారంగానే కనిపిస్తోంది. నటీ నటులు రెమ్యునరేషన్లు తగ్గాలి. ప్రభుత్వాలు, ధియేటర్ల యాజమాన్యాలకు రాయితీలు ఇవ్వాలి. అంతేకాదు, సినిమాల బడ్జెట్ కూడా తగ్గాలి. కానీ, ఇవేవీ సాధ్యమయ్యే వ్యవహారాలు కావు. ప్రభుత్వాలు, ధియేటర్లను ఆదుకునేందుకు ముందుకు రావడం లేదు. సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ సినిమాలు తగ్గడం లేదు. మరెలా.? ఈ సమస్యకు పరిష్కారం ఏంటీ.? సెకండ్ వేవ్ తగ్గలేదు. మూడో వేవ్ వచ్చేస్తోంది. ఆ తర్వాత ఇంకెన్ని వేవ్స్ వస్తాయో తెలీదు. పర్యాటక ప్రాంతాలు కిక్కిరిసి పోతున్నా, అటు వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్న జనం, సినిమా ధియేటర్‌కు రావడానికి భయపడుతున్నారు. పాశ్చాత్య దేశాలలోలా ఓపెన్ ఎయిర్ ధియేటర్లు పుట్టుకు రావాలేమో. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా భవిష్యత్తు అగమ్యగోచరం. నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్లు, ధియేటర్లను నడిపేవారు, అందులో పని చేసేవారు, వాటి మీద ఆధారపడే చిరు వ్యాపారులు.. ఇదో పెద్ద చెయిన్. ప్రభుత్వమే పెద్ద మనసు చేసుకోవాలి.