కారూ, కమలం, హస్తం.. గ్రేటర్ ఎన్నికల్లో సిగ్గుపడాల్సిందెవరు.?

Low turn out in GHMC Polls

గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో పోలింగ్‌ శాతంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. హైద్రాబాద్‌ని విశ్వనగరంలా మార్చేస్తామని రాజకీయ పార్టీలు అంటున్నాయి. కానీ, ఇలాగేనా.? ఓటర్లు పోలింగ్‌ బూత్‌ వద్దకు వెళ్ళడానికి బద్దకిస్తోంటే, హైద్రాబాద్‌ ఎలా విశ్వనగరమవుతుంది.? తప్పు ఎవరిది.? ఓటర్లదా.? రాజకీయ పార్టీలదా.? ఎన్నికల సంఘానిదా.? ఇలా చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Low turn out in GHMC Polls
Low turn out in GHMC Polls

వరుసగా సెలవులొచ్చాయ్‌.. దాంతో, గ్రేటర్‌ హైద్రాబాద్‌ వాసులు చాలామంది సొంతూళ్ళకు వెళ్ళిపోయారు. మరీ ముఖ్యంగా హిందువులకు అతి ముఖ్యమైన రోజుల్లో గ్రేటర్‌ ఎన్నికలు జరిగాయి. కార్తీక మాసం.. కార్తీక పౌర్ణమి.. కార్తీక సోమవారం.. వీటితోపాటు వనభోజనాల సందడి.. ఇలాంటి సమయంలో ఎన్నికలు ఎవరైనా పెడతారా.? కానీ, గ్రేటర్‌ హైద్రాబాద్‌లో ఎన్నికలు జరిగాయి. ఓటర్లు, అవకాశం వచ్చింది కదా.. అని సొంతూళ్ళకో, విహార యాత్రలకో వెళ్ళిపోయారు. దాంతో, పోలింగ్‌ తక్కువగా నమోదయ్యిందన్నది ఓవాదన.

ఇంకోపక్క హైద్రాబాద్‌ చుట్టూ టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ చేసుకున్న రాజకీయ విమర్శలు, ఓటర్లలో అసహనాన్ని పెంచాయి. అది కూడా ఓటర్లు ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనకపోవడానికి ఓ కారణంగా చెబుతున్నారు. అయితే, గతంలోనూ గ్రేటర్‌ పరిధిలో పోలింగ్‌ శాతం తక్కువే నమోదయ్యింది. కానీ, అలాగని సరిపెట్టుకోలేం కదా.!

తప్పు రాజకీయ పార్టీలదే.!

ఎన్నికల ప్రచారం కోసం వేలాది మంది జనాన్ని తరలించాయి రాజకీయ పార్టీలు. ఇది ప్రతి ఎన్నికల సమయంలోనూ జరిగేదే. గ్రేటర్‌ ఎన్నికల్లో ఈ హంగామా ఇంకాస్త ఎక్కువ కనిపించింది. రాజకీయ నాయకుల వెంట తిరిగిన జనమంతా ఓట్లు వేసినా, పోలింగ్‌ శాతం ఇంకాస్త మెరుగ్గా వుండేదేమోనన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. అయితే, చాలామందికి ఓట్లు వున్నా ఇంట్లోంచి బయటకు రాలేకపోయారు.. ఓటెయ్యడానికి సిద్ధపడలేకపోయారు. ఇంకొందరి ఓట్లు తొలగించబడ్డాయి. పోలింగ్‌ బూత్‌ వరకూ వచ్చి, తమ ఓటు లేదని తెలిసి నిరాశ చెందారు చాలామంది. ఇది ఎన్నికల సంఘం వైఫల్యమే.

ఓటర్‌ స్లిప్పులు ఎక్కడ.?

మొబైల్‌ ఫోన్‌లో ఓ యాప్‌ ద్వారా పోలింగ్‌ బూత్‌ తెలుసుకునే అవకాశం కల్పించింది జీహెచ్‌ఎంసీ. కానీ, ఏం లాభం.? అందరికీ స్మార్ట్‌ ఫోన్లు వుండవు కదా.! ఇంటింటికీ ఓటర్‌ స్లిప్పులు పంపిణీ.. అని ఘనంగా అధికారులు ప్రకటించడం తప్ప, ఎంతమందికి అవి అందాయి.? అన్న విషయమై గ్రౌండ్‌ లెవల్‌లో పరిశీలన చేసేదెవరు.? రాజకీయ పార్టీలు, పోలింగ్‌ బూత్‌కి ఆమడ దూరంలో నాలుగు కుర్చీలేసుకుని.. వచ్చే ఓటర్లకు వివరాలు అందజేయబట్టి ఈ మాత్రం ఓటింగ్‌ అయినా నమోదయ్యింది. లేకపోతే, ఓటింగ్‌ శాతం సగానికి పడిపోయేదేమో.!

రాజకీయ పార్టీలకు చెంప పెట్టు

హైద్రాబాద్‌ని అలా మార్చేస్తాం.. ఇలా మార్చేస్తాం.. అంటూ రాజకీయ పార్టీలు ఊదరగొట్టేశాయ్‌. జనం తమతోనే వున్నారని చెప్పని పార్టీ లేదు. ఏరీ, ఎక్కడ.? 50 శాతం కూడా ఓట్లు పోల్‌ అవలేదంటే, ప్రజలు ఎవరి పక్షాన వున్నట్లు.? ఏ రాజకీయ పార్టీతోనూ లేని ఓటర్లదే మెజార్టీ ఇక్కడ. అంటే, ఇప్పుడున్న ఏ రాజకీయ పార్టీ కూడా తమకు అవసరం లేదని ప్రజలు తీర్మానించినట్లే కదా.! మొత్తం రాజకీయ వ్యవస్థ సిగ్గు పడాల్సిన సందర్భమిది.