అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు.. అన్నట్టుంది పరిస్థితి. కరోనా నేపథ్యంలో ప్రభుత్వాలు,ప్రజలకు సాయపడాల్సిన రీతిలో సాయపడలేదు దీంతో, సెలబ్రిటీలు తమకు తోచిన రీతిలో సాయమందించేందుకు ముందుకొచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఎవరు ఏ మందు గురించి రిక్వెస్ట్ పెట్టినా, వీలైనంతవరకు ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు.
తెలుగు సినీ పరిశ్రమ నుంచి యంగ్ హీరో నిఖిల్ సహా దాదాపు అందరు సెలబ్రిటీలూ తమవంతుగా కష్టపడ్డారు. ప్రముఖ నటుడు సోనూ సూద్ అయితే, చేతికి ఎముక లేదా.? అన్నట్టు సాయం చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రముఖ క్రికెటర్, బీజేపీ నేత గౌతమ్ గంభీర్ కూడా తాను నిర్వహిస్తోన్న ఓ సేవా సంస్థ ద్వారా అవసరమైన మందుల్ని అవసరమైనవారికి అందించాడు.
ఈ క్రమంలో పెద్దయెత్తున మందుల్ని స్టోర్ చేసుకోవడం వివాదాస్పదమయ్యింది. ప్రజలకు దక్కాల్సిన మందుల్ని గంభీర్, తన సంస్థలో దాచి పెట్టడమేంటి.? అంటూ ఆయన మీద రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేశారు, ఈ విషయమై కోర్టు మెట్లెక్కారు కూడా. గంభీర్ చేసింది మానవీయ కోణంలో మంచి పనే అయినా, నిబంధనల ప్రకారం అది తప్పిదమని తేల్చారు.
బయట మార్కెట్లో దొరకని మందులు, సోషల్ మీడియా ద్వారా అడిగితే ఎలా దొరుకుతున్నాయి.? అన్న సందేహం చాలామందికి కలగొచ్చుగాక. సోషల్ మీడియాలో రిక్వెస్టులు పెట్టడం ద్వారా, మందు ఎక్కడ వుందనేదానిపై వెతకడానికి ఆస్కారం దొరుకుతోంది. లభ్యత వున్న చోట నుంచి, లభ్యత లేని చోట్లకు మందుల సరఫరా జరిగింది.
ఇందుకు సెలబ్రిటీలు చాలా కష్టపడ్డారు.. సొంత డబ్బుల్ని ఖర్చు చేశారు కూడా. ఆక్సిజన్ సిలెండర్ల విషయంలోనూ ఇలాగే జరిగింది. ఇక్కడ ఎవర్నీ తప్పుపట్టలేం.. సేవ చేసేవాడ్ని చెయ్యనివ్వకుండా వుండడం తప్ప, ఈ వివాదంలో అర్థమేముంది.?