‘కరోనా వైరస్ అంత తేలిగ్గా మాయమైపోదు.. దానితో సహజీవనం తప్పదు..’ చాలా తరచుగా వింటోన్న మాట ఇది. ప్రభుత్వాలకి బాధ్యత లేదు.. ప్రజలకి భయం లేదు.. వెరసి, కరోనా వైరస్ దేశంలో విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతోంది. రాజకీయ పార్టీలకు చెందిన కార్యక్రమాలే కాదు.. ఏమాత్రం భయం లేకుండా ప్రజలు విందులు, వినోద కార్యక్రమాల్లో మునిగి తేలుతుండడంతో కరోనా వైరస్ వ్యాప్తి పెరగకుండా తగ్గుతుందా.? సరే, ఆ సంగతి పక్కన పెట్టేస్తే, కరోనా దెబ్బకి మరో విద్యా సంవత్సరం కాలగర్భంలో కలిసిపోతోంది.
పరీక్షల్లేకుండానే విద్యార్థులు పై తరగతులకు ప్రమోట్ అవుతున్నారు. ఈ పరిస్థితిని ముందే ప్రభుత్వాలు అంచనా వేయలేకపోయాయా.? ప్రపంచ వ్యాప్త పరిస్థితుల్ని విశ్లేషించకుండా, విద్యార్థుల్ని ఇన్నాళ్ళూ ఎందుకు మానసిక క్షోభకి గురిచేసినట్లు.? కరోనా నేపథ్యంలో విద్యా సంస్థలు తెరచుకున్నది కొద్ది రోజులు మాత్రమే. ఈ కొద్ది రోజుల్లో విద్యాభ్యాసం ఎలా పూర్తవుతుంది.? కానీ, పై తరగతులకు విద్యార్థుల్ని ప్రమోట్ చేయాల్సిందే. సరైన విద్య లేకుండా, పై తరగతులకు ప్రమోట్ అయ్యే విద్యార్థులు, ఎలా ఉన్నత చదువుల్లో రాణించగలుగుతారు.? ఇది ఓ వెర్షన్. ఇంకో వెర్షన్ చూస్తే.. విద్యార్థుల మీద కొంత ఒత్తిడి తగ్గినట్టే.
విద్యా సంస్థల యాజమాన్యాల వేధింపుల నుంచి కొంత ఊరట లభించినట్లే.. అన్నది ఇంకో వాదన. ఇప్పుడు కాదు, ఇకపై విద్యార్థులు అగ్ని పరీక్ష ఎదుర్కోవాల్సి వుంటుంది. పోటీ పరీక్షల్లో ముందు ముందు విద్యార్థులు ఎలాంటి ప్రతిభ చూపిస్తారు.? అసలు, కరోనా మహమ్మారి ఎప్పటికి ప్రపంచాన్ని వీడుతుంది.? వ్యాక్సిన్ వేసుకున్నా సరే, కరోనా వ్యాప్తి చెందే అవకాశం వుందంటున్నవైద్య నిపుణుల అభిప్రాయాల నేపథ్యంలో అసలు విద్య.. అనేది భవిష్యత్తులో ఎలా వుండబోతోంది.? ఇదైతే ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే.