గుజరాత్‌లో భారీ వర్షాలు.. సూరత్ జలమయం, పాఠశాలలకు సెలవు..!

గుజరాత్ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. ముఖ్యంగా సూరత్ జిల్లాలో భారీ వర్షాలు పడటంతో రహదారులు నీటమునిగిపోయాయి. ఎక్కడ చూసిన నీరు మునిగిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో, భద్రతా దృష్ట్యా అధికారాలు స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి. విద్యార్థులు, ప్రజలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.

భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని సూరత్, వల్సాద్, జామ్‌నగర్, జునాగఢ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మున్ముందు కొనసాగే అవకాశం ఉన్నందున ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అహ్మదాబాద్, గాంధీనగర్, రాజ్‌కోట్, మెహ్సానా జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ఇచ్చారు.

అమ్రేలి, భావ్‌నగర్, నవ్‌సరి, వడోదర జిల్లాల్లో కూడా అధికారులు జాగ్రత్తగా ఉండమని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు అవసరం అయితే తప్ప బయటకు రాకూడదని చెప్పారు. వర్షాల వల్ల ప్రజా రవాణా బాగా ప్రభావితమైంది. రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది. వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు ప్రభుత్వ సూచనలను తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు.