కేసీఆర్ సొంతింటి వ్య‌వ‌హారంలా ఫీలవుతున్నాడా?

పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ కి కృష్ణా నీటి త‌ర‌లింపు విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిప‌క్షాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదురర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ రాష్ర్ట భ‌విష్య‌త్ ని కేసీఆర్ ఏపీ కి తాక‌ట్టు పెడుతున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు తీవ్రంగా విమ‌ర్శిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తెలంగాణ కాంగ్రెస్ టీపిపిసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ‌కుమార్ రెడ్డి ప్ర‌భుత్వ తీరును త‌ప్పుబ‌ట్టారు.
నీళ్లు నిధులు కాపాడాల‌నే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింద‌ని, సీఎం కేసీఆర్ ఏదో ఉద్ద‌రిస్తాడ‌ని కాద‌ని ఎద్దేవా చేసారు. పోతిరెడ్డిపాడు వ‌ల్ల తెలంగాణ‌కు తీవ్ర న‌ష్టం జ‌రుగుతుంద‌ని, అదిష్టానాన్ని ఒప్పించి తెలంగాణ‌ను తెచ్చామ‌ని ఆయ‌న గుర్తు చేసారు.

తెలంగాణ హ‌క్కుల‌ను కాపాడాల్సిన బాధ్య‌త ఆయ‌న‌పై లేదా? అని ప్ర‌శ్నించారు. ఏపీ సీఎం జ‌గ‌న్, కేసీఆర్ ల మిత్ర‌త్వం తెలంగాణ వ్య‌వ‌సాయానికి గొడ్డ‌లిపెట్టులా మారింద‌న్నారు. జ‌గ‌న్ ఏపీ అసెంబ్లీలో పోతిరెడ్డిపాడుపై ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత కూడా కేసీఆర్ స్పందించ‌లేద‌ని, పైగా జ‌గ‌న్ తో కేసీఆర్ అలైబ‌లై తీసుకున్నార‌ని విమ‌ర్శించారు. పోతిరెడ్డిపాడు అనేది కేసీఆర్ సొంతింటి వ్య‌వ‌హారం కాద‌ని తెలంగాణ స‌మ‌స్య అని అన్నారు. కేసీఆర్ రైతుల ప‌ట్ల ఎంత కుట్ర పూరితంగా వ్య‌వ‌రిస్తున్నారో? ఇటీవ‌ల ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టే ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మ‌వుతుంద‌న్నారు. రైతులు ఏ కాలంలో ఏ పంట‌లు వేయాలో? ఎలా అమ్ముకోవాలో కూడా చెప్ప‌డం కేసీఆర్ నియంత పాల‌న‌కు అద్ధం ప‌డుతుంద‌న్నారు.

రైతులు వేసిన పంట‌ల‌కు గిట్టు బాటు ధ‌ర‌లు మాత్రమే క‌ల్పించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంటుంది. అంతేగానీ ఏ పంట‌లు వేయాలి? ఎలా పండించాలి అన్న‌ది రైతుల‌కు త‌మ లాంటి నాయ‌కులు చెబితే ప్ర‌జ‌లు న‌వ్వుతార‌ని సెటైర్ వేసారు. కేసీఆర్ పాల‌న , రైతులు ప‌ట్ల వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరు చూస్తుంటే? పాకిస్తాన్ ప్ర‌జ‌లు అక్క‌డ ఆర్మీచేత ఎలా పాలింప‌బ‌డుతున్నారో? అలాగే ఉంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇలాంటి నాయ‌కుడిని రెండ‌వ సారి ఎన్నుకోవ‌డం అమాయ‌క‌ ప్ర‌జ‌లు చేసుకున్న పాపమ‌ని మండిప‌డ్డారు.