Health Tips:శీతాకాలంలో చాలామంది దగ్గు, జలుబు, జ్వరం బారిన పడుతుంటారు. అయితే కొంత మందిని పొడి దగ్గు చాలా ఇబ్బంది పెడుతుంటుంది. ఈ ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న వేళ చాలా మంది పొడి దగ్గు సమస్యతో సతమతమవుతున్నారు. పొడి దగ్గు వాతావరణం కాలుష్యం,సిగరెట్లు, బీడీలు తాగడం వల్ల ఎక్కువగా వస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు అయిన ఆస్తమా, టీబీ వంటి వ్యాధి గ్రస్తులను కూడా ఈ సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, దుమ్ము లేదా ఇతర మలినాలు చేరటం వల్ల కూడా పొడి దగ్గు సమస్యలు వస్తుంటాయి. కొన్నిసార్లు ముక్కు లేదా గొంతులో ఏర్పడిన ఎలర్జీ వల్ల కూడా పొడి దగ్గు సమస్య వస్తుంది.
పొడి దగ్గు నివారణకు స్వచ్ఛమైన తేనె గొప్ప ఔషధంగా ఉపయోగపడుతుంది. రాత్రివేళ పడుకునే ముందు గోరు వెచ్చని పాలలో తేనె కలిపి తాగటం వల్ల తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఇలా రోజుకు 2 నుంచి 3 సార్లు తీసుకోవడం వల్ల సత్ఫలితాలు లభిస్తాయి. స్వచ్ఛమైన తేనె తో ఒక టీస్పూన్ అల్లం రసాన్ని కలిపి తీసుకోవడం వల్ల పొడి దగ్గును నివారించవచ్చు.
పొడిదగ్గు నుండి త్వరగా ఉపశమనం పొందడానికి తులసి టీ తీసుకోవాలని నిపుణులు సూచించారు. ఈ టీ ని తయారుచేయడానికి ఒక ఐదు నుండి ఏడు తులసి ఆకులను శుభ్రంగా కడిగి ఒక గిన్నె లో నీటిని వేసి, అందులో తులసి ఆకులను వేసి మరిగించాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వడబోసి చల్లారిన తర్వాత సేవించడం వల్ల పొడి దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.
పొడి దగ్గు సమస్యతో బాధ పడేవారు కొంచం రాక్ సాల్ట్ దవడలో ఉంచుకోవటం వల్ల సమస్య తగ్గుముఖం పడుతుంది. దగ్గు సమస్య ఉన్నవారు ఈ చిట్కాలను పాటించడం వల్ల తొందరగా ఉపశమనం పొందవచ్చు.