Health: రోజూ ఉదయాన్నే ఇది తింటే గుండె ఉక్కులా మారుతుంది.. షుగర్, బీపీ దరిచేరవు..!

ఈ రోజుల్లో బిజీ లైఫ్‌స్టైల్ వల్ల మనుషులకు శరీరంపై శ్రద్ధ తగ్గిపోయింది. సమయానికి భోజనం లేదు, సరైన నిద్ర లేదు, వ్యాయామం అన్న మాటే మరిచిపోయారు. ఫలితంగా వయసుతో సంబంధం లేకుండా బీపీ, షుగర్, ఊబకాయం, హార్ట్ సమస్యలు వేధించడం ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే హృదయ సంబంధిత సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఇలాంటి పరిస్థితిలో గుండెను బలంగా ఉంచడానికి ఖరీదైన చికిత్సలకే పరిమితం కావాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. రోజూ మన వంటగదిలో ఉండే ఒక సాధారణ పదార్థమే గుండెకు గట్టి రక్షణగా నిలుస్తుందని వెల్లడిస్తున్నారు. అదే వెల్లుల్లి. తెల్లవారుజామున ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలు నమిలితే గుండె ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుందని చెబుతున్నారు.

వెల్లుల్లిలో సహజంగా ఉండే ‘అల్లిసిన్’ అనే శక్తివంతమైన మూలకం రక్తనాళాల్లో పేరుకుపోయే చెడు కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దాంతో రక్తప్రసరణ అడ్డంకులు లేకుండా సాఫీగా సాగుతుంది. హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి ప్రమాదకర పరిస్థితుల నుంచి గుండెను కాపాడే శక్తి వెల్లుల్లికి ఉందని వైద్యుల అభిప్రాయం. అంతేకాదు, శరీరంలో అవసరమైన మంచి కొవ్వును పెంచి, హానికరమైన కొవ్వును తగ్గించడం ద్వారా గుండెను మరింత శక్తివంతంగా మార్చుతుంది. రోజూ వెల్లుల్లిని ఆహారంలో భాగం చేస్తే రక్తపోటు క్రమంగా సమతుల్యంలోకి వస్తుందని, అధిక బీపీ సమస్య తగ్గుముఖం పడుతుందని కూడా చెబుతున్నారు.

ఇక షుగర్ ఉన్నవారికి కూడా వెల్లుల్లి ఒక సహజ వరంలా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఇది సహాయపడుతుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో గుండెతో పాటు కిడ్నీలు, మెదడు ఆరోగ్యంగా ఉండే అవకాశం పెరుగుతుంది. అనారోగ్యాన్ని ఆహ్వానించే జీవనశైలి మధ్యలోనూ, రోజుకు రెండు చిన్న వెల్లుల్లి రెబ్బలతో గుండెకు పెద్ద రక్షణ లభిస్తుందని తెలుసుకుని, చాలా మంది ఇప్పుడు ఈ సాధారణ అలవాట్నే ఔషధంగా మార్చుకుంటున్నారు. ఖరీదైన మందులకన్నా ముందు వంటింట్లోని ఈ ప్రకృతి ప్రసాదాన్ని నమ్మితే, గుండె మరింతకాలం దడబలాడకుండా పనిచేసే అవకాశాలు మెండుగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.