దగ్గు మందే ప్రాణాంతకం.. 12 చిన్నారుల మృతి, దేశాన్ని కుదిపేసిన విషాదం..!

దేశాన్ని కుదిపేస్తున్న విషాదం.. సాధారణంగా దగ్గు తగ్గించేందుకు ఇస్తున్న సిరప్‌లు పిల్లలకు ప్రాణహానిగా మారాయి. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా, రాజస్థాన్‌లోని భరత్‌పూర్, సికార్ జిల్లాల్లో ఇప్పటివరకు 12 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ చిన్నారులు ఒకే లక్షణాలతో చనిపోయారు.. అదరికీ కిడ్నీ విఫలం కావడంతో మృతి చెందడం తల్లిదండ్రులను, వైద్యులను, ఆరోగ్య అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

మృతిచెందిన చిన్నారులందరికీ దగ్గు, జలుబు సమస్యల నేపథ్యంలో సిరప్‌లు ఇవ్వడం ఒకే తరహా పరిణామం బయటపడింది. దీంతో ఆ మందుల నాణ్యతపై అనుమానాలు మరింత పెరిగాయి. ఈ ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అత్యవసరంగా అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టంగా చెప్పింది.. రెండు సంవత్సరాల లోపు వయస్సున్న పిల్లలకు దగ్గు సిరప్‌లు ఇవ్వకూడదని. ఐదేళ్ల లోపు వయస్సున్న వారికి సాధారణంగా ఈ మందులు అవసరం లేదని, చాలా సందర్భాల్లో దగ్గు, జలుబు సహజంగానే తగ్గిపోతుందని పేర్కొంది. ఐదేళ్లకు పైబడిన పిల్లలకు కూడా వైద్యులు క్లినికల్‌గా అవసరమని భావించినప్పుడు మాత్రమే పరిమిత మోతాదులో ఇవ్వాలని సూచించింది. పిల్లలకు తగినంత నీరు, విశ్రాంతి, గృహ సంరక్షణే సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక సిరప్‌ల నాణ్యతపైనే ప్రధాన అనుమానం కేంద్రీకృతమైంది. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం డెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ అనే రసాయన పదార్థం ఉన్న సిరప్‌లు కలుషితమై ఉండవచ్చని అంటున్నారు. ఇటీవల మరణించిన చిన్నారులందరికీ ‘కోల్డ్‌రిఫ్’, ‘నెక్స్‌ట్రో’ బ్రాండ్ల సిరప్‌లు వాడినట్లు తెలిసింది. ఇవే విషాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తిస్తున్నారు.

భారతీయ ఫార్మా కంపెనీలు గతంలో తయారు చేసిన దగ్గు మందుల వల్ల గాంబియా, ఉజ్బెకిస్థాన్‌లలోనూ చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తాజాగా గుర్తుకొస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు కేంద్రం మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఫార్మసీలు, ఆరోగ్య కేంద్రాలు GMP (Good Manufacturing Practices) ప్రకారం తయారు చేయబడిన సురక్షితమైన మందులనే వాడాలని ఆదేశించింది.

మధ్యప్రదేశ్‌లో పిల్లల మృతికి కారణమైన సిరప్‌లను ఉత్పత్తి చేసిన కంపెనీపై డ్రగ్‌ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులోని కాంచీపురం సమీపంలో ఉన్న ఆ కంపెనీకి సంబంధించిన అన్ని బ్యాచ్‌లను సీజ్ చేశారు. పూర్తి స్థాయి ల్యాబ్‌ పరీక్షల తర్వాతే నిజమైన కారణం వెలుగులోకి వస్తుందని మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం రాజేంద్ర శుక్లా తెలిపారు.

ఈ సంఘటనతో దేశవ్యాప్తంగా తల్లిదండ్రులలో భయం మొదలైంది. ఒక సాధారణ దగ్గు మందే ప్రాణహానిగా మారితే ఇక పిల్లల భద్రత ఎక్కడ.. అని వారు ప్రశ్నిస్తున్నారు. చిన్నారుల ఆరోగ్యం విషయంలో ఇకపై ఎవరూ అలక్ష్యం చేయరాదని వైద్యులు చెబుతున్నారు.