వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ పెను దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా జగన్ లేఖ రాయడంతో దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. ఒకరకంగా ఏపీ ప్రభుత్వానికి న్యాయవ్యవస్థకు మధ్య యుద్ధం అనేలా మారింది పరిస్థితి. సుప్రీం కోర్టు న్యాయవాదులు కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో అసలుజగన్ ముఖ్యమంత్రిగా అర్హుడు కాదని, ఆయన్ను పదవి నుండి తొలగించాలని పిటిషన్ వేశారు. జగన్ రాసిన ఈ లేఖ పట్ల రాష్ట్ర ప్రజల్లో కూడ బిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అసలు కోర్టులను ఎదిరిస్తూ జగన్ చేసిన పని మంచిదా కాదా అనే ప్రశ్న మొదలైంది. ఈ నేపథ్యంలో గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య చీఫ్ జస్టిస్ విషయమై కేంద్రానికి రాసిన లేఖను తెరపైకి తెచ్చారు.
వైసీపీ వర్గాలన్నీ మొదటి దళిత ముఖ్యమంత్రి ఆనాడే న్యాయవ్యవస్థ గురించి లేఖ రాశారు. అలాంటిది ఇప్పుడు జగన్ రాయడంలో తప్పేముంది అంటూ వాదిస్తున్నారు. జగన్ చేసింది తప్పా, ఒప్పా అనేది పక్కనబెడితే సంజీవయ్య రాసిన లేఖకు, ఈనాడు జగన్ రాసిన లేఖకు, లేఖను రాసిన తీరుకు చాలా వ్యత్యాసం ఉందని మాత్రం ఒప్పుకోవాల్సిందే. ఆనాడు సంజీవయ్య అప్పటి కేంద్ర హోంమంత్రి లాల్‌బహదూర్ శాస్త్రికి చీఫ్ జస్టిస్ తీరు మీద మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. అంతేకానీ అందులో రాజకీయ ప్రస్తావనలు చేయలేదు. అసలు చీఫ్ జస్టిస్ ఇచ్చిన తీర్పులను గురించి మాట్లాడలేదు. చీఫ్ జస్టిస్ చంద్రారెడ్డి తీరు సరిగా లేదని, ఆయన్ను బదిలీ చేయమని లేకుంటే న్యాయవ్యవస్థ మీద ప్రజలకున్న నమ్మకం సన్నగిల్లుతుందని అది చంద్రారెడ్డికి కూడ నష్టమేనని అన్నారు.
అంతేకానీ తన సొంత బాధలను, ఇబ్బందులను, తన ప్రభుత్వం పడుతున్న కష్టాలను మాట్లాడలేదు. తన లేఖ సరిగా ఉంటే గోప్యంగనే విచారణ చేయమని, ఆ లేఖను తమ వద్దే రహస్యంగా ఉంచమని శాస్త్రిగారిని సంజీవయ్య కోరారు. అంటే మూడవ కంటికి తెలియకుండా చేయాల్సింది చేయమని కోరారు. శాస్త్రిగారు అలాగే చేశారు కూడ. అది జరిగిన కొన్నేళ్ళకు లేఖ సంగతి బయటికొచ్చింది. కానీ వైఎస్ జగన్ లేఖ రాసిన తీరు ఎలా ఉంది. అందులో ఏమాత్రం గోప్యత పాటించలేదు. లేఖ రాసిన మరుసటిరోజే మీడియా ముందు మీటింగ్ పెట్టి యుద్ధం ప్రకటించారు. పైగా లేఖలో కోర్టు తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని, తన ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నారని, ఇందులో చంద్రబాబు రాజకీయ కుట్ర దాగుందని, కోర్టు తీర్పులతో పాలన సరిగా చేయలేకపోతున్నట్టు అంతా స్వగతమే రాసుకొచ్చారు తప్ప ఆనాడు సంజీవయ్య చూపించిన న్యాయవ్యవస్థను కాపాడాలనే తపన అందులో లేదు.