అక్కడ తప్పించుకుని ఇక్కడ బుక్ అయిపోయిన దేవినేని ఉమ

తనను చంపడానికి అధికార పార్టీ కుట్ర పన్నుతోందనీ, గడిచిన రెండేళ్లుగా మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తామెలాంటి కుట్రల్ని విపక్షాలపై ప్రయోగించిందీ తెలియనంత అమాయకుడైతే కాదు దేవినేని ఉమ. పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో ఆయనకి ఆయనే సాటి. సరే, అధికారం కోల్పోయాకా, ప్రజల్లో సింపథీ కోసం ఇలాంటి స్టంట్లు చేయడం వింతేమీ కాదు. రాజకీయాల్లో ఇలాంటి అత్యుత్సాహం అప్పుడప్పుడూ రాజకీయంగా ఎదగడానికి ఉపయోగపడొచ్చు. కానీ, కొన్నిసార్లు, ఆ అత్యత్సాహమే రాజకీయంగా కొంప ముంచేయొచ్చు. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో దేవినేని ఉమ ఓ మార్ఫింగ్ వీడియో ద్వారా ముఖ్యమంత్రిపై బురద చల్లేందుకు ప్రయత్నించారు.

అప్పట్లో ఆయనపై కేసు నమోదైంది. కరోనా సాకుగా చూపి, అరెస్టు నుండి అప్పట్లో తప్పించుకున్నారు. కానీ, ఈ సారి తప్పించుకోవడానికి అవకాశమే లేకుండా పోయింది. అత్యత్యాహానికి మూల్యం చెల్లించుకోక తప్పలేదు. వైసీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్ మీద తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేసి, అనుచరులతో కలిసి హంగామా చేయబోతే చుక్కెదురైంది. ఈ క్రమంలో హైడ్రామా నడిచింది. చివరికి దేవినేని ఉమని పోలీసులు అరెస్టు చేశారు. ఓ దళిత వ్యక్తి తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ దేవినేని ఉమ సహా పలువురు నేతల మీదా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, న్యాయ మూర్తి ఎదుట వర్చువల్ విధానంలో హాజరు పరిచారు. దేవినేని ఉమకి న్యాయమూర్తి 14 రోజులు రిమాండు విధించారు. అయితే, గతంలో మంత్రిగా పని చేసిన దేవినేని ఉమ హత్యాయత్నానికి పాల్పడతారా.? పాల్పడి ఉంటారా.? అన్నవిషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.