అయోధ్య.. ఈ పేరు ఎత్తితే మత ఘర్షణలు, అల్లర్లు, రాజకీయ ఎత్తుగడలు, కోర్టు కేసులు, రెండు మతాల మధ్య గొడవలే గుర్తొచ్చేవి ఇన్నాళ్ళు. కానీ ఆ అల్లకల్లోలాల మాటున మహోన్నత చరిత్ర ఉంది. హిందువులు వందల ఏళ్ళ నుండి కన్న కల ఉంది. ఆ కలే రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణం. వేల ఏళ్లుగా ఉన్న రామ మందిరాన్ని కూల్చి 15వ శతాబ్దంలో బాబ్రీ మసీదును నిర్మించారని చరిత్ర చెబుతోంది. 20వ శతాబ్దిలో బాబ్రీ మసీదును కూల్చడంతో తీవ్ర ఉద్రిక్తత మొదలైంది. ఆ చరిత్ర, ఆ తర్వాతి పరిణామాలు అందరికీ తెలుసు. రాముడు ఏలిన ఈ రాజ్యంలో రామ మందిరం లేని ఊరు, వాడ ఉండదని అంటారు. అలాంటిది రాముడు పుట్టిన పవిత్ర స్థలంలోనే ఆయనకు ఆలయం లేకుండా వందల ఏళ్లు గడిచాయి.
ఈ పరిస్థితి కోట్లాది మంది హిందువులను కలచి వేసింది. ఏళ్ళ తరబడి రామ్ లల్లా ఆలయం ఒక చిన్న టెంట్లో నడవడం బాధించింది. అందుకే తిరిగి అక్కడ రామ మందిరం వెలిస్తే చూడాలని ఆశించారు. అనేక మంది రామ మందిర నిర్మాణమే ఊపిరిగా బ్రతికారు. ఆనాడు రథయాత్రతో ఉద్యమాన్ని ఉధృతం చేసిన అద్వానీతో సహా అనేక మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పోరాటంలో పాల్గొన్నారు. చివరికి సుప్రీం కోర్టు హిందూ, ముస్లిం రెండు వర్గాలకు ఆమోదయోగ్యమైన తీర్పును ఇవ్వడంతో వందల ఏళ్ళ కల సాకారమయ్యే మార్గం తెరుచుకుంది. అయోధ్యలో రామ మందిరం నిర్మించమని సర్వోన్నత స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో దేశం పొంగిపోయింది.
సుప్రీం ఆదేశాలతో రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం సర్వాంగ సుందరంగా రాముడి ఆలయాన్ని నిర్మించడానికి పూనుకుంది. దేశంలో ఉన్న ఇతర పుణ్యక్షేత్రాల తరహాలోనే రామ మందిరం కూడా ప్రత్యేకంగా ఉండేలా డిజైన్లు రూపొందించింది. నిర్మాణంలో ఎలాంటి లోహాలు వాడకుండా కేవలం శిలలతోనే భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా, రాముడి గొప్పతనం సాక్షాత్కరించేలా నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. మూడేళ్లలో ఆలయం పూర్తికావాలని టార్గెట్ పెట్టుకుంది. కట్టబోయే ఆలయం 1000 నుండి 1200 ఏళ్లపాటు నిలబడేలా నిర్మాణ శైలి ఉండనుంది. ఆలయం పూర్తై పూజలు మొదలయ్యాక తిరుమల, కాశీ, హరిద్వార్, అమరనాథ్, రిషికేష్ మాదిరిగానే అయోధ్య కూడ ప్రసిద్ద పుణ్యక్షేత్రంగా మారనుంది. కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆలయ నిర్మాణానికి వెండి ఇటుకలతో భూమి పూజ జరిగింది. ఈ అపూర్వ ఘట్టాన్ని చూసి యావత్ దేశం పులకించిపోయింది. ఊరు వాడల భక్తులు ఎవరికి వారే ఇంట్లో పూజలు చేసి సంబరపడ్డారు.