కోవిడ్ వ్యాక్సినేషన్: ఆ అద్భుతమైన అవకాశాన్ని రాష్ట్రాలు కోల్పోయాయా.?

Covid Vaccination
Covid Vaccination
నాణానికి ఓ వైపు మాత్రమే కాదు.. ఇంకో వైపు కూడా చూసుకోవాలి. కేంద్రం దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ అందించే బాధ్యత తమదేనని తేల్చి చెప్పింది. రాష్ట్రాలకు అవసరమైన వ్యాక్సిన్లను ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పింది. దాంతో, రాష్ట్రాలు ఇకపై గొప్పలు చెప్పుకోవడానికి ఆస్కారమే లేకుండా పోయింది. నిజానికి, రాష్ట్రాలు కోరింది వేరు.
 
విదేశాల నుంచి వ్యాక్సిన్లను రాష్ట్రాలు దిగుమతి చేసుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ ఇబ్బందుల్ని తొలగించాలన్నది రాష్ట్రాల ప్రధానమైన డిమాండ్. ఇంకోపక్క, ఇది జాతీయ సమస్య గనుక, కేంద్రమే ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో, చేసేది లేక.. కేంద్రం, వ్యాక్సినేషన్ బాధ్యతని తన భుజాల మీద వేసుకుంది. అయితే, కేంద్రం వ్యాక్సినేషన్ కోసం ఎన్ని వేల కోట్ల ఖర్చవుతుందన్నదానిపై ఇప్పటికే లెక్కలు బయటపెట్టింది. ఆ సొమ్ముల్ని తిరిగి రాబట్టుకోవడానికి ఎలాగూ కేంద్రం, కొత్త పన్నుల మోత మోగించేస్తుందనుకోండి.. అది వేరే సంగతి. తద్వారా లాభం కేంద్రానికే.
 
నిజానికి, రాష్ట్రాలు గనుక వ్యాక్సినేషన్ బాధ్యతను కొంత మేర తీసుకుంటే, ప్రజలకూ కొంత వెసులుబాటు దొరికేది. ఇక్కడా పన్నుల వాత తప్పకపోవచ్చుగానీ.. మరీ కేంద్రం బాదేంత స్థాయిలో పన్నుల మోత వుండదేమో. కేంద్రం, వ్యాక్సిన్ తయారీ కేంద్రాల నుంచి వ్యాక్సిన్ కొనుగోలు చేసేందుకు ఎంత ఖర్చు చేస్తుంది.? ఒక్క వ్యాక్సిన్ డోసు ఖరీదు విషయంలో గత ఒప్పందాలకీ, కొత్త ఒప్పందాలకీ మార్పులు ఏమైనా వుంటాయా.? ఇలా సవాలక్ష ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.
 
అసలు వ్యాక్సిన్ ధర విషయమై మొదటి నుంచీ గందరగోళమే కొనసాగుతోంది. రాష్ట్రాలు గనుక వ్యాక్సిన్ తయారీ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటే.. ఆ లెక్క ఇంకోలా వుండేది. అదేంటో, రాష్ట్రాలు ఏం చేసినా పరోక్షంగా మోడీ సర్కారుకి మేలే జరుగుతోంది.