Covid Tsunami : నలభై ఐదు వేల టెస్టులు.. పదమూడు వేలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు.. వెరసి పాజిటివిటీ రేటు అటూ ఇటూగా ముప్ఫయ్ శాతం. కోవిడ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి హద్దూ అదుపూ లేకుండా కొనసాగుతోంది.
రాష్ట్రంలో విద్యా సంస్థలు యధాతథంగా నడుస్తున్నాయి. పర్యాటక ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. అలాంటప్పుడు, కోవిడ్ ప్రమాద ఘంటికలు మోగించకుండా వుంటుందా.? ఇవి కాక, ఉద్యోగుల ఆందోళనలు, రాజకీయ పార్టీల కార్యక్రమాలు.. వెరసి, అసలు రాష్ట్రంలో కోవిడ్ వుందన్న భయమే ఎవరికీ లేకుండా పోయింది.
ఇదిలా వుంటే, కోవిడ్ పాండమిక్ అనగానే ముందుగా పండగ చేసుకునే ఆసుపత్రులు పూర్తిస్థాయిలో బాధితుల కుటుంబాల్ని దోచేయడానికి సర్వసన్నద్ధంగా వున్నాయి. టెస్టుల దగ్గర్నుంచి వైద్య చికిత్స వరకు ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ చాలా ఘనంగా నడుస్తోంది. అయినా, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలున్నాయి.
కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా మారిన దరిమిలా, ఇంటింటికీ ఫీవర్ సర్వే.. అంటూ ప్రభుత్వం హడావిడి చేస్తోంది. నిజానికి, ఈ సమయంలో ఇలాంటి చర్యలు అవసరమే. కానీ, వాటివల్ల ప్రయోజనమెంత.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
కోవిడ్ మూడో వేవ్ కనీ వినీ ఎరుగని రీతిలో జనాన్ని బాధితులుగా మార్చేస్తోంది. ‘మరణాల రేటు తక్కువగా వుంది..’ అన్న ఒక్క కారణంతో అటు ప్రభుత్వానికీ, ఇటు ప్రజలకూ బాధ్యత లేకుండా పోతోంది. అయితే, మొదటి వేవ్ అలాగే రెండో వేవ్ సందర్భంగా ప్రభుత్వాలు చెప్పిన లెక్కలనీ, వాస్తవ పరిస్థితులకీ అస్సలు పొంతన లేదు.
అంతిమంగా ప్రజలే ఇక్కడ బాధితులు గనుక, బాధ్యతగా వుండాల్సింది కూడా వాళ్ళే. ప్రభుత్వాలంటారా, వాటి నిర్లక్ష్యం.. వైఫల్యం సర్వసాధారణమే.. అధికారంలో ఎవరున్నా అంతే.