వైకాపా పార్టీలో కరోనా కలకలం మొదలైంది. ఇన్నాళ్లు సామాన్య జనాన్ని ఇబ్బంది పెట్టిన కరోనా ఇప్పుడు ఏపీలోనూ రాజకీయ నాయకులపై దాడి మొదలుపెట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా ఎస్ కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సదరు ఎమ్మెల్యే వైరస్ వ్యాప్తికి ముందు అమెరికా వెళ్లొచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమెరికా నుంచి రాగానే హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా వైద్యయంత్రాంగం ట్రూనాట్ తో పాటు, ఆర్డీ ఆర్పీ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లు తేల్చారు. ప్రస్తుతం శ్రీనివాసరావు విశాఖపట్టణంలోని ఓ గెస్ట్ హౌస్ లోని ఐసోలేట్ లో డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు.
అయితే సదరు ఎమ్మెల్యే పాజిటివ్ అని తేలక ముందు ఎక్కడెక్కడ తిరిగారు అన్న దానిపై పార్టీ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. దానికి తోడు ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో శ్రీనివాసరావు ఓటు వేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యేలు, ఎన్నికల సిబ్బంది ప్రభుత్వ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. దీనికి సంబంధించిన అధికారులు ఆ జిల్లా కలెక్టర్ తో సమావేశమైనట్లు సమాచారం. అయితే శ్రీనివాసరావు ఎప్పుడు అమెరికా వెళ్లారు? ఎప్పుడు అక్కడ నుంచి తిరిగివచ్చారు? 14 రోజులుగా క్వారంటైన్ లో ఎప్పుడు ఉన్నారు? సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో బయట ఎక్కడెక్కడ తిరిగారు? వంటి అంశాలపై సరైన స్పష్టత రాలేదు.
రెండు నెలల కిందటి వరకూ విజయనగరం జిల్లా ఒక్క కేసు కూడా లేకుండా కంప్లీట్ గ్రీన్ జోన్ ఉండేది. కానీ అక్కడా ఒక్కసారిగా కేసులు పెరిగిపోయాయి. ఇప్పుడు ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకే కోవిడ్ సోకడంతో జిల్లా రాష్ర్ట వ్యాప్తంగా సంచలనమవుతోంది. ఏపీకి చెందిన రాజకీయ నాయకుల్లో కూడా తొలి పాజిటివ్ కేసు నమోదైన వ్యక్తిగా అధికార పార్టీ ఎర్టీ ఎమ్మెల్యే కావడం గమనార్హం. ఇప్పటికే ఏపీలో కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయని అందరిలో టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధికే కరోనా సోకడం ప్రజల్లో చర్చకొస్తుంది. పక్క రాష్ర్టం తెలంగాణ ఎమ్మెల్యేలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే.