హైదరాబాద్ లో కరోనా విలయతాండవం గురించి చెప్పాల్సిన పనిలేదు. జంట నగరాల్లో(హైదరాబాద్-సికింద్రాబాద్) కొవిడ్ పంజా విసురుతోంది. కరోనా దాడికి భయపడి అంతా ప్రాణాలు అరచేత పట్టుకుని తట్టాబుట్టా సర్ధుకుని స్వగ్రామాలకు, స్వరాష్ర్టాలకు చేరుకుంటున్నారు. పని సంగతి తర్వాత…ముందు ప్రాణం ముఖ్యం అంటూ జనాలంతా సిటీని వదిలి వెళ్లిపోతున్నారు. జీహెచ్ ఎంసీకి ఎంత దూరంలో ఉంటే అంత మంచిదని భావించి దూరంగా వెళ్లిపోతున్నారు. వర్షాకాలం కూడా మొదలైపోవడంతో మళ్లీ పాత అంటు రోగాలు ప్రబల్లితే పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోతుంది. ఇప్పటికే కరోనాని కట్టడి చేయడంలో విఫలమైన సర్కార్..వాటిని అదుపు చేయడం ఇంకా కష్టమవుతోంది. ఈ పరిస్థితులన్నింటికి దూరంగా బ్రతకాలని అంతా పట్టణం..వదిలి పల్లెబాట పడుతున్నారు.
సిటీలో ఉన్న వాళ్లంతా సీటీకి దూరంగా ఉన్న ఫామ్ హౌస్ లో తల దాచుకుంటున్నారు. కరోనా పూర్తిగా తగ్గే వరకూ సిటీ దరిదాపుల్లోకి కూడా వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సీటీకి దూరంగా ఉన్న జగ్వేల్ లో ఉన్న ఆయన సొంత నివాస గృహంలో ఉంటున్నారు. గత నాలుగు రోజులుగా ఆయన అక్కడే ఉంటున్నారు. తాజాగా కేసీఆర్ మరో ఇల్లు, దేవాలయంగా భావించే ప్రగతి భవన్ కు కూడా కరోనా సోకింది. అందులో పనిచేస్తున్న ఐదుగురి ఉద్యోగులకి కరోనా పాజిటివ్ వచ్చింది. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతోన్న వారికి అనుమానం వచ్చి పరీక్షలు నిర్వహించగా కరోనాగా నిర్ధారణ అయింది.
దీంతో మిగతా అధికారులు, తరుచూ ప్రగతి భవన్ కి వచ్చి పోయే వారిలో టెన్షన్ మొదలైంది. ఈ నేపథ్యంలో సీఎం కూడా టెన్షన్ లో ఉన్నట్లు వెబ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ నాలుగు రోజుల క్రితమే గజ్వేల్ కు చేరుకున్నారు.అంతకు ముందు సిటీలో తిరిగారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో, మంత్రులతో సమావేశమవ్వడం చేసారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కరోనా సోకిన వ్యక్తులతో కలిసారా? లేదా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది. కరోనా సోకిన ఆ ఐదుగురు ఎవరెవరితో కలిసారు? ఎక్కడ తిరిగారు వంటి వివరాలు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కరోనా తెలంగాణ నాయకుల్ని చుట్టేస్తోన్న సంగతి తెలిసిందే.