రాజకీయాల్లో ఎవరి వ్యూహం వారిది. ఎవరి వ్యూహం అయితే , ప్రజల్లోకి బాగా బలంగా తీసుకుపోగలుగుతారో వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ వ్యూహాలు కొన్నిసార్లు సక్సెస్ అవుతుంటాయి. మరికొన్ని సార్లు అడ్డంగా బోల్తా కొట్టేస్తాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సమయంలోనైనా, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ సీఎం కేసీఆర్ తన వ్యూహాన్ని ఎప్పుడూ మార్చలేదు. ఒకే వ్యూహాన్ని అనేకసార్లు రిపీట్ చేస్తూ విజయబావుటా ఎగరవేస్తున్నారు. ప్రత్యర్థులకు కూడా అంతుచిక్కని ఆ విజయ రహస్యమేంటో, ప్రతీసారి ఫాలో అయ్యే రాజకీయ వ్యూహమేంటో ఇప్పుడు చూద్దాం …
స్వరాష్ట్ర సిద్ధికై టీడీపీకి గుడ్ బై చెప్పి 2001వ సంవత్సరం ఏప్రిల్ 27న కేసీఆర్ ’తెలంగాణ రాష్ట్ర సమితి‘ పార్టీని ప్రకటించారు. తనతో కలిసి వచ్చే నాయకులను అక్కున చేర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర పోరాటాన్ని ఉదృతం చేశారు. ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, ప్రతీ గ్రామానికి తెలంగాణ ఉద్యమాన్ని చేరవేయడానికి ఆయన ఒకే ఒక్క వ్యూహాన్ని నమ్ముకున్నారు. అదే ’రాజీనామా వ్యూహం‘. తెలంగాణ రాష్ట్రం కంటే తమకు పదవులు ఎక్కువ కాదన్న అభిప్రాయాన్ని ప్రతీ తెలంగాణ పౌరుడికి తెలియాలన్నది కేసీఆర్ ఆకాంక్ష. అందుకే సవాళ్లు ఎదురైన ప్రతీ సారి తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించారు. ఉప ఎన్నికలకు వెళ్లారు. తెలంగాణలో గత 20 ఏళ్లలో అత్యధికంగా ఉప ఎన్నికలు జరిగాయి. కేసీఆర్ ఫాలో అయిన రాజీనామాల వ్యూహమే అందుకు ప్రధాన కారణమన్నది వేరుగా చెప్పనవసరం లేదు.
ఉప ఎన్నికలు వచ్చిన ప్రతీసారి గ్రామగ్రామాన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. టీఆర్ఎస్ అభ్యర్థులు బరిలో ఉన్న చోట ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. ఒకటి రెండు సార్లు మినహాయిస్తే ప్రతీసారి కేసీఆర్ వ్యూహమే ఫలించింది. ఉద్యమంలో తనను గెలిపించిన రాజీనామా వ్యూహాన్ని తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వదిలిపెట్టలేదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యారు. అధికారానికి ఇంకా ఆరు నెలలు సమయం ఉన్నా సరే ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నారు. పదవులకు రాజీనామా చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించారు.