బడుగల సంక్షేమం అంటూ మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీర్మానం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ తీర్మానంపై వైకాపా ఎమ్మెల్సీ ఉమ్మరెడ్డి వెంకటేశ్వర్లు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. బలిపీఠంపై బడుగుల సంక్షేమమా? బాబు అంటూ ధ్వజమెత్తారు. ఈ ఒక్కటీ చూస్తే చాలు రాబోయే మూడు రోజుల్లో వాస్తవాలకు విరుద్దంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి తెలుగు దేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు అనడానికి నిదర్శనమని ఎద్దేవా చేసారు. ప్రభుత్వ పథకాల గురించి, అనుసరిస్తున్న విధానాల గురించి తప్పుడు సమాచారం, తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తేదాపా విశ్వ ప్రయత్నాలు చేస్తోందన్నారు.
గత ఎన్నికల సమయంలో 60 పేజీల మేనిఫెస్టోను ప్రజలు తిరస్కరించి, చంద్రబాబును ఇంటికి పంపితే ఇంకా మారకుండా కుట్రలు, కుతంత్రాలకు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. గతంలో చంద్రబాబు వరంగల్ లో బీసీ సదస్సు నిర్వహించారని, అప్పుడు తాను కూడా చంద్రబాబుతో ఉన్నానని తెలిపారు. ఆ వేదిక సాక్షిగా బీసీలకు 50 శాతం సీట్లు ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే బాబు బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారో తెలుస్తుందన్నారు. 50 శాతం ఇస్తామన్న పెద్ద మనిషి 29 శాతం ఇచ్చి సరిపెట్టుకోండి అన్నారు. అది చంద్రబాబు రాజకీయం అని దెప్పి పొడిచారు. 2019లో జగన్ ఇచ్చిన టిక్కెట్లు, మంత్రి వర్గంలో స్థానాలు చూసి పోల్చుకుంటే ఎవరి బీసీల పక్షపాతో తెలుస్తుందన్నారు.
అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారటీలకు పోర్టు ఫోలియో ఇచ్చిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. 2014 నుంచి 2019 వరకూ బడుగు, బలహీన వర్గాలకు మంత్రి పదవి ఎందుకివ్వలేదో సమాధానం చెప్పాలన్నారు. రాష్ర్టం ఏర్పాడ్డాక ఈ రెండు వర్గాలు లేకుండా మంత్రి మండలి కొలువైన దాఖలాలు లేవన్నారు. నంద్యాల ఉప ఎన్నిక తర్వాత ఫరూక్ కి, కిడారి సర్వేశ్వరరావు హత్య తర్వాత ఆయన కుమారుడికి మంత్రి పదవి ఇచ్చామని మాత్రమే చంద్రబాబు అనిపించారు. కానీ జగన్ ఆ విధంగా పనిచేయడం లేదు. సమాజంలో దగాకు గురవుతున్న వారికి మంచి పోర్ట్ ఫోలియోలు, రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్సీ తెలిపారు.