Chandrababu : చంద్రబాబులానే వైఎస్ జగన్‌కి కూడా షాక్ తప్పదా.?

Chandrababu : రాష్ట్ర ఆర్థిక పరిస్థితేంటి.? ఆ పనులేంటి.? అన్న చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో.. అందునా, అధికార పార్టీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో జరుగుతోంది. ఎడా పెడా శంకుస్థాపనలు జరుగుతున్నాయి. అదిగో విశాఖలో ఆ అద్భుతం.. ఇదిగో కడపలో ఈ అద్భుతం.. అంటూ చంద్రబాబుని మించిన గ్రాఫిక్స్.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చూపించేస్తున్నారు.

ఏదీ ఎక్కడ.? గడచిన రెండున్నరేళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా జరిగిన అభివృద్ధి ఏంటి.? అంటే, గ్రామ సచివాలయాలు.. వాలంటీర్ల గురించి మాత్రమే పేర్కొంటోంది వైఎస్ జగన్ ప్రభుత్వం, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. పోలవరం ప్రాజెక్టు ఓ కొలిక్కి రాలేదు. రాజధానుల అంశం ఎటూ తేలలేదు.

సరే, రాజధాని.. పోలవరం ప్రాజెక్టు.. లాంటి పెద్ద వ్యవహారాల సంగతి తర్వాత. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల మాటేమిటి.? అక్కడా పనులు నత్తనడకనే సాగుతున్నాయి. కొన్నయితే శంకుస్థాపనలకే పరిమితమైపోయాయి.

ఎప్పుడు సొంత జిల్లాకి వెళ్ళినా, ‘ఇక్కడి నేలపై ప్రత్యేకమైన అభిమానం..’ అని చెబుతుంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కానీ, ఆ అభిమానం మాటలకే పరిమితమా.? చేతల మాటేమిటి.? రోజులు, నెలలు.. సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయ్. కానీ, అభివృద్ధి వ్యవహారాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయాయరయ్యాయి.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా తయారవడంతోనే ఈ సమస్యలు. కానీ, అలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా తయారవడానికి కారణం అభివృద్ధిని పక్కన పెట్టి, సంక్షేమం మీద జగన్ సర్కార్ శ్రద్ధ పెట్టడమే. సంక్షేమం, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది మరి.