36 గంటల దీక్షతో చంద్రబాబు సాధించినదేంటి.?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు 36 గంటల పాటు టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో చేసిన దీక్ష ముగిసింది. వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యాలయంపై చేసిన దాడికి నిరసనగా చంద్రబాబు ఈ దీక్ష చేశారు. అయితే, టీడీపీ కార్యాలయంపై దాడికి అసలు కారణం, టీడీపీ నేత పట్టాభి మాట్లాడిన బూతులే.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బూతులు తిట్టారు పట్టాభి. దానికి పర్యవసానమే టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తల దాడి. అయితే, ఇక్కడ వైసీపీ దాడిని ఎవరూ సమర్థించరు. అలాగే పట్టాభి బూతుల్నీ సభ్య సమాజం హర్షించదు.

నిజానికి, టీడీపీ అధినేత చంద్రబాబు, దీక్ష కంటే ముందు పట్టాభి వ్యాఖ్యల పట్ల చింతిస్తూ ప్రకటన చేసివుండాల్సింది. ఆ తర్వాత చంద్రబాబు వైసీపీ దాడిపై దీక్ష చేసి వుంటే, చంద్రబాబు హుందాతనమే పెరిగి వుండేది. కానీ, అలా చేస్తే ఆయన చంద్రబాబు ఎందుకవుతారు.?

అందుకే, చంద్రబాబు 36 గంటల పాటు చేసిన దీక్ష వృధా ప్రయాసగానే మిగిలిపోయింది. ‘పరదా అడ్డం పెట్టుకుని చంద్రబాబు డ్రై ఫ్రూట్స్ తినేశారు..’ అంటూ అధికార పక్షం ఆరోపణలు చేయడం అనేది రాజకీయ కోణంలోనే చూడాలేమో. సరే, డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న చంద్రబాబు 36 గంటల పాటు నిరసన దీక్ష ఎలా చేశారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

చంద్రబాబు దీక్ష నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద తిట్ల వర్షం కురిపించేశారు. అంటే, ఇక్కడ చంద్రబాబు దీక్షలోనే చిత్తశుద్ధి లేదన్నమాట. తిట్టడానికైతే దీక్షలు చేయడమెందుకు? ప్రెస్ మీట్ పెడితే సరిపోదా.? బహిరంగ సభ నిర్వహిస్తే సరిపోదా.?