క‌రోనాపై కేసీఆర్ చేతులెత్తేసిన‌ట్లేనా?

క‌రోనా మ‌హ‌మ్మారి దేశంలో ప్ర‌వేశించ‌గానే అది చిన్న జ్వ‌రం లాంటింది. పారాసిట‌మాల్ మాత్ర వేసుకుంటే త‌గ్గిపోతుంద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అసెంబ్లీ స‌మావేశాల సాక్షిగా చెప్పిన మాట అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఆ త‌ర్వాత క‌రోనా ఎలా ఆట ఆడించిందో కూడా తెలిసిందే. అదే ముఖ్య‌మంత్రి చేత మాయ‌దారి క‌రోనా..లైట్ గా తీసుకునే జ్వ‌రం కాదు. అత్యంత సీరియ‌స్ గా తీసుకోవాల్సిన జ్వ‌రం అంటూ పిలుపునిచ్చి ప‌నిచేయ‌డం ప్రారంభించారు. అంచెలంచెలుగా లాక్ డౌన్ పొడిగిస్తూ వ‌చ్చారు. కేసీఆర్ అయితే కేంద్రం ప్ర‌క‌ట‌న రాక‌ముందే రాష్ర్టంలో లాక్ డౌన్ పొడిగించ‌డం జ‌రిగింది. స‌డ‌లింపులు ఇచ్చాం క‌దా అని ఇష్టాను సారం రోడ్ల మీద తిరిగితే మ‌ళ్లీ లాక్ డౌన్ క‌ఠినంగా అమలు చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

ఒకానొక స‌మ‌యంలో ఓ అడుగు ముందుకేసి సౌత్ కోరియా దేశం లాంటి సంచ‌ల‌న ఎన్ కౌంట‌ర్ నిర్ణ‌యాలు తీసుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌న్నంత నియంత పోక‌డ‌ని చూపించారు. ఇక ప‌రీక్ష‌ల విష‌యంలో కేసీఆర్ స‌ర్కార్ తొలి నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కుంటూనే ఉంది. అన్ని రాష్ర్టాల్లో ల‌క్ష‌ల్లో ప‌రీక్ష‌లు జ‌రుగుతుంటే తెలంగాణ లో మాత్రం వేల‌ల్లో జరుగుతున్నాయి. దీంతో విమ‌ర్శ‌లు అంత‌కంతకు పెరిగాయి. పాజిటివ్ కేసుల సంఖ్య‌ను దాచి పెట్టింద‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కుంది. ఈ విష‌యంపై హైకోర్టే మొట్టికాయ‌లు వేసింది. అయినా కేసీఆర్ వెన‌క్కి త‌గ్గ‌లేదు. హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ సుప్రీంకు వెళ్తామ‌ని చెప్పారు.

మ‌రోవైపు గాంధీలో క‌రోనా రోగుల‌కు స‌రైన చికిత్స అందించ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని, డాక్ట‌ర్ల‌పై రోగి బంధువులు తిర‌గ‌బ‌డ‌టం వంటి స‌న్నివేశాలు ప్ర‌భుత్వ వైఫ‌ల్యానికి కార‌ణాలుగా చెప్పుకోవ‌చ్చు. ఇక తాజాగా కరోనా పరీక్ష‌లు..వైద్యం ప్ర‌యివేటు ఆసుప‌త్రిల‌కి కూడా ఇచ్చేసింది. ప‌రీక్ష‌లు, ఐసోలేష‌న్,వెంటిలేట‌ర్ ఐసీయూలో ఉంటే ఇంత అవుతుందంటూ ధ‌ర‌ల ప‌ట్టిక‌ను ప్ర‌భుత్వం నిర్ణ‌యించి ప్ర‌జ‌ల మీద‌కే ఆ భారాన్ని తొసేసింది. దీన్ని బ‌ట్టి కేసీఆర్ ప్ర‌భుత్వం పూర్తిగా క‌రోనాపై చేతులెత్తేసిన‌ట్లు తేలిపోయింది. క‌రోనాని జాతీయ విప్తత్తుగా ప్ర‌కటించారు. కాబ‌ట్టి ఈ రోగానికి సంబంధించి వైద్య ఖ‌ర్చులు మొత్తం ప్ర‌భుత్వ‌మే భ‌రించాలి. కానీ కేసీఆర్ సర్కార్ ప్ర‌యివేటు ఆసుప‌త్రుల‌కు ఇచ్చేయ‌డం మ‌హ‌మ్మారి పై పూర్తిగా చేతులెత్తేసిన‌ట్లు అయింది. కేసీఆర్ వైఫ‌ల్యాల‌ను ఎత్తిచూపుతూ ప్ర‌తిప‌క్షం ఇప్ప‌టికే తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తిన సంగ‌తి తెలిసిందే.