తమిళ రాజకీయాల్లో జయలలితకు ప్రత్యేక స్థానం ఉంది. అప్పటివరకు ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాలను ఆమె చేశారు. ఒంటరిగానే అన్నాడీఎంకే పార్టీని నడిపిస్తూ డీఎంకే లాంటి బలమైన ప్రత్యర్థి పార్టీని నిలువరిస్తూ కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ జాడలు రాష్ట్రంలో కనబడకుండా చేయడం లాంటి పనులన్నీ ఒంటరిగానే చేశారామె. ఏనాడూ పొత్తుల జోలికి వెళ్లకుండా ఏకఛత్రాధిపత్యం నడిపారు. ఎవ్వరూ ఢీకొట్టలేదని స్థాయికి వెళ్లారు. ఒక్క అన్నాడీఎంకే మినహా మిగతా పార్టీలు, నాయకులు అందరూ జయలలిత ఉండగా ఏం చేయలేం అని తోకలు ముడిచారంటే ఆమె ప్రభావం ఎలాంటిదో చెప్పొచ్చు. అయితే ఆమె మరణానంతరం రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి.
అన్నాడీఎంకేలోనే లుకలుకలు మొదలయ్యాయి. జయలలిత స్నేహితురాలు శశికళ జైలుపాలైంది. ఆమె మేనల్లుడు దినకరన్ సొంత పార్టీ పెట్టుకున్నారు. ప్రస్తుతం పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇదే రైట్ అని భావించిన బీజేపీ రాజకీయం స్టార్ట్ చేసింది. మొదట స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీతో స్నేహం కుదుర్చుకుంది. స్టాలిన్ ను చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూసింది. కానీ స్టాలిన్ మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు. పొత్తులో ఉంటే నేను చెప్పినట్టే వినాలని ఖరాఖండిగా చెప్పేశారు. ఇక ఆయనతో లాభం లేదనుకున్న బీజేపీ అన్నాడీఎంకే మీద కన్నేసింది. ఆ పార్టీని వాడుకుని తమిళరాజకీయాల్లో పాతుకుపోవాలని చూస్తోంది.
అందుకుగాను శశికళను వాడాలని చూస్తోంది. శశికళ జైలు నుండి వస్తే తమిళ రాజకీయాలు వేగంగా మారుతాయి. రాబోయే ఎన్నికల్లో ఆమె ప్రభావం తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా అన్నాడీఎంకేకు ఆమె సెగ తప్పదు. జయలలిత స్నేహితురాలిగా ఆమెపై సానుభూతి ఉంది జనంలో. అందుకే శశికళను అన్నాడీఎంకేతో కలపాలని చూస్తున్నారు. వారితోపాటే దినకరన్ పార్టీని కూడ ఒక్కటిచేసేలా మంతనాలు నడుపుతున్నారు. దినకరన్ గెలవలేకపోయినా అన్నాడీఎంకే ఓట్ బ్యాంకును గట్టిగా చీల్చగలడు. అదే జరిగితే 30 నుండి 40 చోట్ల అన్నాడీఎంకె దెబ్బతింటుంది. అలా జరిగి డీఎంకేకు అధికారం అప్పగించడం ఎందుకు, అందరం కలిసి పనిచేసుకోవచ్చు కదా అనే ప్రతిపాదన తెస్తున్నారు కమలనాథులు.
ఈ ప్రతిపాదన ఫలించి ఏఐఏడిఎంకెతో శశికళను కలిపితే ముందు ముందు ఆమెను మరో జయలలితను చేయాలని, ఎలాగో శశికళ మీద అభియోగాలు, కేసులు, విచారణలు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీని చెప్పుచేతల్లో పెట్టుకుంటే భవిష్యత్తు తమదే అనే ఆలోచనలో ఉన్నట్టుంది బీజేపీ.