నేడు భారత్ బంద్ .. మద్దతు తెలిపిన 40వేల వాణిజ్య సంఘాలు , పెట్రోల్ రేట్ల పెంపుపై నిరసన !

దేశంలో ప్రతిరోజూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, జీఎస్టీ నియమాల్లో మార్పులు, ఈ-వే బిల్లుంగ్‌లకు నిరసనగా అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య శుక్రవారం దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్ ‌కు ఆల్ ఇండియా ట్రాన్స్‌ పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (AITWA), సంయుక్త కిసాన్ మోర్చా (SKM)తో పాటు పలు ప్రజా సంఘాలు, వ్యాపార సంఘాలు మద్దతు తెలిపాయి. CAIT పిలుపుతో దేశవ్యాప్తంగా 40వేల వ్యాపార సంఘాలు, 8 కోట్ల మంది వ్యాపారులు బంద్‌ కు మద్దతు తెలుపుతున్నారు.

దేశవ్యాప్తంగా చక్కా జామ్ నిర్వహిస్తామని యూనియన్ నేతలు తెలిపారు. 1500 చోట్ల చక్కా జామ్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఇవాళ సుమారు 80 లక్షల రవాణా వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోనున్నాయి. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఒకేలా ఉండాలని.. దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికి ప్రాతినిథ్యం వహిస్తున్న 40,000 సంఘాలు ఈ బంద్‌లో పాల్గొంటాయని సీఏఐటీ సెక్రటరీ జనరల్‌ ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ గురువారం ప్రకటించారు.

భారత్ బంద్‌కు మద్దతుగా వ్యాపారులంతా తమ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలను ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు బయటకు తీయవద్దని.. ఉన్న ప్రాంతాల్లో పార్కింగ్ చేయాలని వ్యాపార సంఘాల నేతలు సూచించారు. గోడౌన్ల వద్ద నిరసన బ్యానర్లు ప్రదర్శించాలని కోరారు. ప్రజలంతా శాంతియుతంగా బంద్‌లో పాల్గొనాలని వ్యాపార సంఘాలు విజ్ఞప్తి చేశాయి. మండుతున్న పెట్రోల్ ధరలను తగ్గించడంతో పాటు కొత్త ఈవే బిల్లును వెనక్కి తీసుకోవాలని వ్యాపార, వాణిజ్య సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జీఎస్టీ చట్టంలోని నియమ నిబంధనలను పున:సమీక్షించాలని కోరుతున్నాయి.

అటు భారత చట్టాలను ఉల్లంఘిస్తున్న అంతర్జాతీయ ఈ-కామర్స్ సంస్థల విషయంలో కఠినంగా వ్యవరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలాఉంటే.. బంద్‌లో తాము పాల్గొనబోవడం లేదని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా వ్యాపార్‌ మండల్‌, భారతీయ ఉద్యోగ్‌ వ్యాపార్‌ మండల్‌ స్పష్టం చేశాయి. ఈ రెండు సంఘాల కింద కూడా వందల సంఖ్యలో యూనియన్లున్నాయి. దీంతో ఈ బంద్‌కు ఏ మేరకు స్పందన లభిస్తుందన్నది వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమైంది.