విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న చేపట్టనున్న భారత్ బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్టు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు తెలిపారు. విశాఖ ఉక్కు పోరాట వేదిక, రైతు సంఘాలు తలపెట్టిన ఈ బంద్‌లో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో టీడీపీ వెనకంజ వేయదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు పార్లమెంటు సాక్షిగా కేంద్రం అడుగులు వేస్తున్నా వైసీపీ ఎంపీలు మౌనంగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కార్మికుల జీవితాలపై వైసీపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ పార్టీ నేతలు వెంటనే రాజీనామా చేసి పోరాటానికి ముందుకు రావాలని డిమాండ్ చేశారు.
జగన్ సహకారంతో పోస్కోతో ఒప్పందం కుదిరిందని, చీకటి ఎజెండాతో కార్మికులను రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి మోటార్లకు మీటర్లు బిగించే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్ వెనక్కి తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. వైసీపీ నమ్మక ద్రోహానికి, నయవంచనకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.