ఇప్పటికే ప్రపంచంలో అనేక వ్యాక్సిన్లు కొరోనాను ఎదుర్కోటానికి అందుబాటులోకి వచ్చాయి. భారత్ లో ప్రముఖంగా ఇప్పటివరకు కొవాక్సిన్, కొవీషీల్డ్ వ్యాక్సిన్లను చాలా మందికి అందివ్వటం జరిగింది. ఇవేకాక ఇటీవలనే రష్యా వ్యాక్సిన్ “స్పుత్నిక్ వి’ కూడా మన మార్కెట్ లోకి అడుగు పెట్టింది. అయితే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత నమ్మదగిన, శక్తివంతమైన వాక్సిన్ గా కొనియాడబడుతున్న ‘ఫైజర్ వాక్సిన్’ అతి త్వరలోనే మన దేశంలో కూడా అందుబాటులోకి రానున్నట్లుగా తెలుస్తుంది. ఈ వాక్సిన్ ను అమెరికా ఫార్మాస్యూటికల్ దిగ్గజం ‘ఫైజర్ సంస్థ’… జర్మన్ భాగస్వామి బయో-ఎంటెక్ సహకారంతో ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసింది.
ఫైజర్ వ్యాక్సిన్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆమోదించటంతో ఇప్పటికే అనేక దేశాలు దిగుమతి చేసుకుని తమ ప్రజలకి అందిస్తున్నాయి. అయితే ఈ వాక్సిన్ ను నిల్వ చేయటంలో ఉండేటువంటి ఇబ్బందులను సరిచేసి అనుకూలంగా మార్చటంతో భారత్ లాంటి దేశాలు కూడా ఫైజర్ వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ప్రభుత్వ ఆధీనంలో మాత్రమే ఈ వాక్సిన్ ను పంపిణీ చేసేందుకు ఫైజర్ సంస్థ నిర్ణయించుకుందని సమాచారం. మన దేశంలో ఫైజర్ వాక్సిన్ ఒక డోసు ధర షుమారుగా 750 వరకు ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. దీంతో కరోనాతో చేసే యుద్ధంలో భారత ప్రజలకు మరింత శక్తివంతమైన ఆయుధం చౌకగా అందరానుందని భావించవచ్చు.
చైనాలో ‘కరోనావాక్’ టీకాను మూడు సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు పిల్లలకు అందించేందుకు ఆ దేశం అనుమతించింది. అమెరికా, కెనడా, బ్రిటన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల్లో పిల్లలకు వేసే కరోనా వ్యాక్సిన్‌కు ఇప్పటికే ఆమోదం లభించింది. మరో పక్క ఫైజర్, మోడెర్నా లాంటి పలు కంపెనీలు పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తి చేశాయి. ఫైజర్ వ్యాక్సిన్‌కు బ్రిటన్‌లో ఆమోదం లభించింది కూడా. కరోనా మూడో వేవ్ పిల్లల మీద ఎక్కవ ప్రభావం చూపనుందని వినబడుతున్న వేళ వారిని రక్షించుకునేందుకు ఫైజర్ వ్యాక్సిన్ బాగా ఉపయోగపడుతుందని శాస్త్రజ్ఞులు, నిపుణులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అతి త్వరగా దిగుమతి చేసుకుని సరఫరా చేయటానికి అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు వేగవంతం చేసిందని సమాచారం.