AP Politics : ఏపీ రాజకీయం: ఉద్యోగులు హ్యాపీ.. విపక్షాలకే బీపీ.!

AP Politics : ఉద్యోగులు ఇంత తేలిగ్గా కన్విన్స్ అవుతారని బహుశా అధికార పక్షం కూడా అనుకుని వుండదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ఖజానాపై దాదాపు పది వేల కోట్ల వరకు అదనపు భారం పడేలా నిర్ణయం తీసుకున్నారు ఫిట్మెంట్ తదితర విషయాల్లో. ఆ విషయాన్ని లెక్కలతో సహా ఉద్యోగ సంఘాల నేతలకు ముఖ్యమంత్రి వివరించడంతో, పీఆర్సీ సహా ఇతర వ్యవహారాలపై నిన్నమొన్నటిదాకా గుస్సా అయిన ఉద్యోగ సంఘాలు ఒక్కసారిగా సైలెంటయిపోయాయి.

ఉద్యోగ విరమణ వయస్సు పెంచడం సహా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల పట్ల ఉద్యోగులు సానుకూల స్పందన వ్యక్తం చేయడం మినహా వ్యతిరేకించలేని పరిస్థితి. కాస్త టైమ్ తీసుకున్నా, ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల నాయకుల్ని కన్విన్స్ చేయగలిగారు. ఉద్యోగ సంఘాలు నిజంగానే కన్విన్స్ అయ్యాయా.? లేదంటే తప్పనిసరి పరిస్థితుల్లో ‘సరే’ అన్నాయా.? అన్నది వేరే చర్చ.

ముఖ్యమంత్రికి ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపేయడంతో, ఇక్కడితో ఉద్యోగ సంఘాల ఆందోళనకు శుభం కార్డు పడినట్లే. ఇకపై ఉద్యోగ సంఘాల నేతలు ఇంకోసారి ఆందోళనబాట పట్టే అవకాశం వుండదు. ఒకవేళ ఉద్యోగ సంఘాలు ప్లేటు ఫిరాయిస్తే, ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది.

‘మేం తలచుకుంటే ప్రభుత్వాన్ని కూలుస్తాం..’ అనేదాకా కొందరు ఉద్యోగ సంఘాల నేతలు వెళ్ళిపోయారు. వారికి వంతపాడాయి విపక్షాలు.. అందునా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఎప్పుడైతే ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం ప్రకటించిన ఫిట్మెంట్ విషయంలో సంతృప్తి వ్యక్తం చేశాయో, ఆ వెంటనే టీడీపీకి బీపీ పెరిగిపోయింది.

సోషల్ మీడియా వేదికగా ఉద్యోగ సంఘాల నేతలపైనా, ఉద్యోగులపైనా సెటైర్లు వేస్తూ ‘దురద’ తీర్చుకుంటున్నారు టీడీపీ మద్దతుదారులు.