ఓ రెండు దశాబ్దాల క్రితమే హైద్రాబాద్ తర్వాత ఆ స్థాయిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని విశాఖలోనూ అభివృద్ధి చేయాలనే చర్చ జరిగింది. ఆ దిశగా కొన్ని ప్రయత్నాలూ జరిగాయి. కానీ, ఏం లాభం.? అన్నీ వున్నా.. అల్లుడి నోట్లో శని.. అన్న చందాన తయారైంది పరిస్థితి. అప్పటికీ, ఇప్పటికీ విశాఖలో పెద్దగా మార్పు ఏమీ రాలేదు.
విశాఖ పేరుతో పబ్లిసిటీ స్టంట్లు నడుస్తూనే వున్నాయి. విశాఖను ఉద్ధరించేస్తానన్నాడో ప్రబుద్ధుడు 2014 నుంచి 2019 వరకూ. కానీ, విశాఖలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదు ఐటీ రంగానికి సంబంధించి. గడచిన రెండేళ్ళలో వైఎస్ జగన్ హయాంలోనూ విశాఖలో పరిస్తితి స్తబ్దుగానే తయారైంది.
ఆ మాటకొస్తే, పూర్తిగా విశాఖ అభివృద్ధి నిలిచిపోయిందనడం సబబేమో.నిజానికి, చంద్రబాబు హయాంలో విశాఖకు రాజధాని అయ్యే అవకాశం వచ్చిందిగానీ, చంద్రబాబు అత్యంత వ్యూహాత్మకంగా ఆ ప్రతిపాదన పక్కన పెట్టి, కొత్త రాజధాని.. అంటూ పచ్చని పంట పొలాల్ని రాజధాని కోసం సేకరించారు. విశాఖనే రాజధానిగా చంద్రబాబు ప్రకటించి వుంటే, ఇప్పుడు విశాఖ నగరం పరిస్థితి ఇంకో స్థాయిలో వుండేది.
అయ్యిందేదో అయిపోయింది.. ఇప్పటికన్నా విశాఖ బాగుపడుతుందా.? అంటే, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామంటోంది జగన్ ప్రభుత్వం. ఐటీ రంగానికి విశాఖను రాజధాని చేస్తామన్నది జగన్ సర్కార్ చెబుతున్నమాట.
ఆ దిశగా ఐటీ కొత్త పాలసీ కూడా ప్రభుత్వం నుంచి ప్రకటితమైంది. అంతే కాదు, విశాఖకు ఎలాగూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ హోదా కల్పిస్తామంటోంది గనుక.. జగన్ సర్కార్ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తే, విశాఖ.. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా మారుతుందన్నది నిర్వివాదాంశం.
కానీ, ప్రస్తుత కరోనా సంక్షోభంలో విశాఖలో ఐటీ రంగం పుంజుకునే అవకాశాలున్నాయా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు చిత్తశుద్ధితో జరిగితే.. విశాఖ అభివృద్ధి, ఆంధ్రపదేశ్ అభివృద్ధి.. రెండూ సాధ్యమే.