ఉమ్మడి జమ్మూ కాశ్మీర్ కొన్నాళ్ళ క్రితమే రెండుగా విడిపోయింది. ఒకటి లడఖ్.. ఇంకోటి జమ్మూకాశ్మీర్. వీటిల్లో లడఖ్ విషయంలో ఎలాంటి సమస్యలూ లేవు. కాశ్మీర్ విషయంలోనే సమస్యలున్నాయ్. అక్కడే తీవ్రవాద ప్రభావం ఎక్కువ. ఎప్పుడైతే జమ్మూకాశ్మీర్ రెండుగా విడిపోయిందో, ఆ తర్వాత అక్కడ పరిస్థితులు మారాయి.
ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతాలుగా వున్నాయి లడఖ్, జమ్మూకాశ్మీర్. కాగా, జమ్మూ కాశ్మీర్ వ్యవహారానికి సంబంధించి కేంద్రం, ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలతో చర్చలు జరిపింది. జమ్మూకాశ్మీర్ అతి త్వరలో రాష్ట్రంగా అవతరించే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీనికోసమే కేంద్రం కసరత్తులు చేస్తోంది. అయితే, అంతకన్నా ముందు అక్కడ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ జరగాల్సి వుంది. అంటే, నియోజకవర్గాలు పెరుగుతాయన్నమాట. దేశంలో ఓ రాష్ట్రంలో మాత్రమే ఈ పని చేస్తే సరిపోదు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ జరగాల్సి వుంది.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన చట్టంలోనే ఆ అంశం స్పష్టంగా పేర్కొనబడి వున్నా, నరేంద్ర మోడీ సర్కార్ గడచిన ఏడేళ్ళుగా అందుకు అనుకూలమైన నిర్ణయం తీసుకోలేకపోయింది. జమ్మూకాశ్మీర్ విషయంలో కదలిక వచ్చిందంటే.. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ విషయమై రాజకీయ కదలిక వచ్చినట్లుగానే భావించాలి. ముచ్చటగా మూడోసారి వరుసగా కేంద్రంలో అధికారంలోకి రావాలనుకుంటోన్న బీజేపీ, అందుకు తగ్గట్టుగానే పావులు కదుపుతోంది.. అందులో భాగంగానే ఈ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ అంశం కూడా తెరపైకొస్తోందని అనుకోవాలేమో. ఢిల్లీ నుంచి అందుతున్న లీకుల ప్రకారం చూస్తే.. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ మాత్రమే కాదు, జమిలి ఎన్నికలు కూడా వుండొచ్చేమో. ఏమో, మోడీ తలచుకుంటే ఏదైనా సాధ్యమే.