130 కోట్ల మందికి పైగా జనాభా వున్న భారతదేశంలో అందరికీ కోవిడ్ 19 వ్యాక్సిన్లు ఇవ్వడం ఎంతవరకు సాధ్యం.? అన్న ప్రశ్న చాన్నాళ్ళ క్రితం వినిపించింది. వ్యాక్సిన్ ధర మాత్రమే కాదు, చాలా సమస్యలున్నాయ్.. అందరికీ వ్యాక్సిన్ అందించడానికి. అయితే, భారత ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది వ్యాక్సినేషన్ విషయంలో.
మొదట దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారిని, తక్కువ ఇమ్యూనిటీ వున్నవారినీ ఎంచుకుని.. వారికి వ్యాక్సినేషన్ వేగంగా పూర్తి చేసే కార్యక్రమం చేపట్టారు. ఆ తర్వాత వృద్ధులు.. ఆ తర్వాత 45 ఏళ్ళ వయసు పైబడినవారికి.. క్రమక్రమంగా దాన్ని 30 ఏళ్ళ పైబడినవారికి.. చివరికి 18 ఏళ్ళు పైబడినవారికి.. వ్యాక్సినేషన్ చేయడం షురూ చేశారు.
ఇంత వ్యూహాత్మకంగా వ్యవహరించబట్టే, చాలా వేగంగా 100 కోట్ల వ్యాక్సిన్లు కేంద్రం అందించగలిగింది. రాష్ట్రాలే వ్యాక్సిన్లను కొనుగోలు చేయాలని కేంద్రం గతంలో ప్రకటించినప్పుడు, తీవ్ర గందరగోళం నెలకొంది. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో.. కేంద్రమే పూర్తిగా వ్యాక్సిన్లను సమీకరించి, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడంతో.. ఇబ్బందులు దాదాపుగా తొలగిపోయాయ్.
కేంద్రం ఇచ్చినా, రాష్ట్రాలు ఇచ్చినా.. అంతిమంగా వ్యాక్సిన్ ఖర్చు సామాన్యుల మీదనే పడుతుందన్నది నిర్వివాదాంశం. ప్రభుత్వం వ్యాక్సినేషన్ కోసం చేసిన ఖర్చుకి సంబంధించి ప్రతి పైసా పన్నుల రూపంలోనో, మరో రూపంలోనో జనం నుంచి వసూలు చేసేదే. ఇది బహిరంగ రహస్యం.
ఎలాగైతేనేం, వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తినా, ప్రపంచానికి దిశా నిర్దేశం చేసేలా వ్యాక్సినేషన్ తమ ప్రజలకు వ్యాక్సినేషన్ చేయిస్తోంది భారతదేశం. 100 కోట్ల డోసులు.. ఇదో అత్యద్భుమతైన రికార్డ్. కానీ, చేరాల్సిన గమ్యం ఇంకా చాలా దూరంలోనే వుంది. 130 కోట్ల మంది భారతీయులంటే 260 కోట్లకు పైన డోసులు అందించాల్సి వుంటుంది.