వైకాపాకు గత ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం ఇచ్చిన జిల్లాల్లో నెల్లూరు జిల్లా కూడా ఒకటి. ఈ జిల్లాలో ఉన్న 10కి 10 అసెంబ్లీ స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. ఇలాంటి జిల్లాలో కొన్నాళ్ళుగా పార్టీ కీలక నేతల మధ్యన సయోధ్య తప్పిన వాతావరణం కనిపిస్తోంది. మంత్రి పదవుల కేటాయింపులు జరిగినప్పుడు జిల్లా ఎమ్మెల్యేల మధ్యన మొదలైన అంతరాలు మెల్లగా తారాస్థాయికి చేరాయి. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి యువ లీడర్లతో అస్సలు పొసగని పరిస్థితి కనబడుతోంది. జిల్లా రాజకీయాల్లో తనకు ప్రాధాన్యం తగ్గుతోందని ఆనం భావిస్తున్నారు.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు ఆనం. అంతేకాదు జిల్లాలో ఆయన సామాజిక వర్గం కూడా పెద్దదే. ఒకప్పుడు జిల్లా రాజకీయాల్ని శాసించిన కుటుంబం కావడంతో ఇప్పుడు యువ నెతల ఆధిపత్యం కింద పనిచేయాల్సి రావడం ఆయనలో అసహనాన్ని రేకెత్తిస్తోంది. పైగా అనిల్ కుమార్ యాదవ్, కొటంరెడ్డిలు ఆనంను పెద్దగా లెక్క చేయడంలేదనే టాక్ కూడా ఉంది. గతంలో కూడా ఆనం జిల్లాలో రౌడీ రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. అప్పుడు స్వయంగా సీఎం వైఎస్ జగన్ కలుగజేసుకుని వ్యవహారాన్ని చక్కబెట్టారు.
మళ్లీ తాజాగా ఆనం అసంతృప్తి స్వరం వినిపించారు. నెల్లూరు జిల్లా ప్రభుత్వాధికారులపై ఆనం మండిపడ్డారు. విద్య, వైద్యం, సంక్షేమ పథకాలపై అధికారులు నివేదికలు తయారుచేయలేదని తప్పుబట్టారు. జలవనరుల శాఖలో అధికారులు నీళ్లు అమ్ముకుంటున్నారని, ఎస్‌ఎస్ కెనాల్‌ను పరిశీలించాలని సీఎం జగన్ చెప్పినా అధికారులు వినడంలేదని, 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రస్తుతం ఇలాంటి తీరు ఎన్నడూ చూడలేదని అన్నారు. చివరగా ప్రజల కోసం ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీయడానికి కూడా సిద్దమని తిరుగుబాటు ప్రకటన చేశారు.
23 జిల్లాలకు మంత్రిగా పనిచేసిన తనకు ఎమ్మెల్యే పదవి అలంకారం లాంటిదని ఆనం అనడం చూస్తే పదవి దక్కలేదని, జిల్లా రాజకీయాల్లో ప్రాముఖ్యత తగ్గిందని ఆయనలో దిగులు ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. అంతేకాదు ఆయన వైఖరి చూస్తే ఈసారి పదవుల మార్పులో తనకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని అధిష్టానానికి సిగ్నల్స్ ఇచ్చినట్టుగా ఉంది. మరి కంచుకోట లాంటి నెల్లూరు జిల్లాలో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్న ఈ అంతర్గత పోరుపై వైఎస్ జగన్ ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం చాలా ఉంది.
