మోదీ విధానాలు పైకి చాలా గొప్పగానే కనిపిస్తాయి, వినిపిస్తాయి కానీ అమలులో మాత్రం భారీ వ్యత్యాసం బయటపడుతుంటుంది. పాత నోట్ల రద్దు, ఒకే ట్యాక్స్ విధానాలు ఇలాంటివే. ఇప్పుడు ఇలాంటి కొత్త విధానమే మరొకదాన్ని తెరమీదకి తెచ్చింది భాజాపా సర్కార్. అదే ఒకే దేశం.. ఒకే వ్యవసాయ మార్కెట్. ఈ విధానంలో రైతులు తాము పండించిన పంటను దేశంలో ఎక్కడైనా, ఎవరికైనా తన ఇష్టం వచ్చిన ధరకు అమ్ముకోవచ్చు. అంటే రైతుపై ఎలాంటి ఆంక్షలు ఉండవు.
వినడానికి ఈ విధానం ఎంతో గొప్పగా, రైతులకు సర్వ హక్కులు ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ లోపమంతా లోపలే ఉంది. రైతును పంటను తీసుకెళ్ళి ఎక్కడైనా అమ్ముకోమంటే ఏమిటి అర్థం. మీ పంటకు మీరే బాధ్యులు, మధ్యలో రవాణాకు, నిల్వకు ప్రభుత్వ సహకారం ఉండదు అని. ఈ పద్దతిలో ఒకటి రెండు ఎకరాల్లో పంట పండించే రైతు వేలకు వేలు రవాణా ఖర్చులు పెట్టుకుని దేశం మొత్తం తిరగగలడా.. తిరగలేడు. పండించిన కొద్దిపాటి పంటకు వారాలు, నెలలు తరబడి కోల్డ్ స్టోరేజ్ అద్దెలు కట్టగలడా.. కట్టలేడు. అలా ఖర్చులు భరించలేని చిన్న రైతు వచ్చినకాడికి అమ్ముకుని పోదాం అనుకుంటాడే కానీ పంటను కుళ్లబెట్టుకోడు.అప్పుడే కార్పొరేట్ శక్తులు రంగంలోకి దిగుతాయి.
నేరుగా రైతు వద్దకు చేరుకుని పంటల్ని దళారీలు లేకుండానే కొనుగోలు చేసి భారీ మొత్తంలో నిల్వ చేస్తాయి. అన్నట్టు కొన్ని నిత్యావసర సరుకుల నిల్వల పరిమితులపై కూడా ఆంక్షలు ఎత్తివేసింది కేంద్రం. ఈ వెసులుబాట్లను వినియోగించుకుని సంస్థలు కృత్రిమ కొరతను సృష్టించి అధిక ధరకు విక్రయాలు ఆరంభిస్తాయి. దీంతో వినియోగదారుడికి కొనుగోలు భద్రత కూడా ఉండదు. ఈ విధానం పూర్తిగా అటు రైతుకు, ఇటు వినియోగదారునికి శాపంలా కార్పొరేట్ శక్తులకు వరంలా మారనుంది.