ఆధునిక యుగంలో తెలుగులో చెప్పుకోదగ్గ సినిమా విమర్శ లేదు. అందుకు కారణం సీరియస్ విమర్శకులు సినిమాను విశ్లేషించాల్సిన పదార్ధంగా భావించక చులకనగా చూడడమే.
కత్తి మహేష్, చల్లా శ్రీనివాస్, సికిందర్, ప్రసేన్, అండ్ యువర్స్ ఒబీడియంట్లి మాత్రమే తరచుగా విరివిగా రాసారు. అయితే వీళ్ళలో తమ విమర్శకు పుస్తక రూపం ఇచ్చిన వాళ్ళు తక్కువ. ఇప్పుడు ప్రసేన్ తన సినీ విమర్శ నంతటినీ ఒక్క చోట చేర్చి ప్రసేన్ @సినిమా పేరుతో పుస్తకంగా మన ముందుంచాడు. గత పదేళ్లలో విడుదలైన సినిమాలలో 125 కు పైగా సినిమాలకు సంబందించిన విశ్లేషణలు ఈ పుస్తకంలో ఉన్నాయి. సినిమాను పొగిడారా తెగిడారా అనే విషయాన్ని పక్కకు పెడితే ఏం చేసినా ప్రసేన్ రాత మాత్రం ఆసక్తిని రేకేత్తించేదిగా ఉంది. పాఠకుడిని ఉత్కంఠ లో ముంచెత్తుతు సమీక్షలను ఉరుకులు పెట్టించాడు. కొన్ని సందర్భాలలో నిర్ధాక్షిణ్యంగా ఉన్నట్టు అనిపించినా కొన్ని సినిమాలను ఆకాశానికెత్తేయడంలో కూడా అంతే ఉదారంగా ఉన్నాడు ప్రసేన్. ఆచార్య, వకీల్ సాబ్ సినిమా సమీక్షలు ఒక ఉదాహరణ అయితే మహానటి, ఆ, ఎవడే సుబ్రహ్మణ్యం సమీక్షలు మరో రకం ఉదాహరణలు. ప్రతి సమీక్ష కు ప్రసేన్ ఒక రూపపరమైన విధానాన్ని అనుసరించాడు. అందుకే అన్ని సమీక్షలు ఒక్క దగ్గర చేర్చి ఒకే సారి చదివినా బోర్ అనిపించదు. ప్రసేన్ కు సాహిత్యం తో మంచి పరిచయం ఉండడం, తెలుగు సాహిత్యంలో ఒక ప్రముఖ కవిగా ప్రముఖ విమర్శకుడిగా ఒక స్థానం ఉండడం సినిమాను నిర్ధిష్టంగా తూచడానికి సహకరించింది. నిజం చెప్పాలంటే సీరియస్ సాహిత్య విమర్శనా వ్యాసాలలో ఉండే చిక్కదనం ప్రసేన్ ప్రతి సినిమా సమీక్షా వ్యాసంలోనూ కనపడుతుంది.
పైగా నిష్కర్షగా ఉండడం అనేది ఈ సమీక్షలకు ఒక అదనపు అందాన్నిచ్చింది. తెలుగులో కొందరు మినహా అనేక మంది కెమెరా పనితనం చూడ ముచ్చటగా ఉంది, నాయికా నాయకులు అలరించారు, హాస్యం బాగా పండింది, ఇంటిల్లిపాదీ చూడదగ్గ చిత్రం లాంటి రొడ్డ కొట్టుడు రాతలు తప్ప భిన్నంగా విమర్శ రాసిన వారు లేరు. ప్రసేన్ సినిమా బాగో లేదు అన్న దగ్గర స్పష్టంగా ఎక్కడ బాగో లేదో ఎందుకు బాగోలేదో వివరించాడు. దర్శకుడు కథకుడు ఎక్కడ పొరపాట్లు చేశారో విడమర్చి చెప్పాడు. అదే ఈ పుస్తకానికి రీడబిలిటీ నిచ్చింది. ఏ విశ్లేషణయినా ప్రేక్షకుడు పాఠకుడిగా మారిపోయి ప్రసేన్ తో ఏకీభావం చెందుతాడు తనకు నచ్చకపోయినా.
ఈ పుస్తకం ద్వారా, లేదా తన సమీక్షల ద్వారా ప్రసేన్ కొన్ని విషయాలను స్పష్టం చేయదలచుకున్నట్టు అర్ధమవుతోంది. సినిమా చాలా సీరియస్ సాహిత్యం అనేది ఒక కోణం అయితే,సినిమాకు సామాజిక స్పృహ ఉండాలి, సినిమా సమాజాహితాన్ని ప్రధానంగా ఆలోచించాలి అన్నది మరో కోణం. ఈ అంశాలు కేవలం నినాద ప్రాయంగా కాక ప్రతి సమీక్షలోనూ అంతర్లీనంగా ప్రకటితమయేట్టు ప్రసేన్ విమర్శ సాగింది. సినిమా కేవలం డబ్బులకోసం మాత్రమే కాక జనం కోసం అయితే బాగుండు అనే తపన ప్రతి అక్షరంలోనూ కొట్టొచ్చినట్టు కనపడుతూంది. సినిమాను వ్యాపార బలిపీఠం మీంచి దింపి జన జీవన స్రవంతిలో కలపాలన్న ఆశ అడుగడుగునా ఉంది.
మొదటి రోజు మొదటి ఆట చూసి వెంటనే ఒక అంచనాకు రావడం ఎవరికైనా కష్టమైన పనే. ఆ పని లో ప్రసేన్ విజయం సాధించాడు. తను నకారాత్మక తీర్పులిచ్చిన సినిమాలను జనం తిప్పికొట్టారు. తను ఆకాశానికెత్తిన సినిమాలకు బ్రాహ్మరధం పట్టారు. ఇదే ఆ గెలుపు. అదే క్రమంలో ప్రసేన్ కు ఉన్న సినిమా పరిజ్ఞానం కూడా చదువరిని ఆశ్చర్యంలో ముంచేస్తుంది. చాలా చోట్ల హిందీ, ఆంగ్ల సినిమాల ప్రస్తావనలు, ఏ సినిమాను ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారు వంటి నిరూపణలు మనకు ప్రసేన్ సినీ జ్ఞాన విస్తృతిని తెలియ జేస్తాయి. ఆంగ్ల మలయాళ ఫ్రెంచ్ హిందీ సినిమాలను అలవోకగా కోట్ చేయడం ప్రసేన్ ప్రత్యేకత అని అర్ధమవుతుంది. షోలే రామాయణం నుంచి కాపీ అని రుజువు చేసి మనల్ని ఆశ్చర్య పరుస్తాడు. ఒకే కథనుంచి పదే పదే వచ్చిన సినిమాల జాబితా మనముందుంచి షాక్ కూడా ఇస్తాడు.
వ్యాపార సినిమాల గురించి సమీక్షలు ఇంత విశ్లేషణాత్మకంగా ఇచ్చిన పుస్తకం ఇప్పటి వరకూ బహుశా తెలుగులో రాలేదనుకుంటా. సత్య మూర్తి, గుడిపూడి శ్రీహరి, చల్లా శ్రీనివాస్ రాసినప్పటికీ పుస్తక రూపంలో తీసుకురాలేదు. యువర్స్ ఓబీడీయేంట్లి ఆ పని చేస్తున్నప్పటికీ ప్రసేన్ ముందున్నట్టే. ఈ పుస్తకం కచ్చితంగా సినిమా రంగంలోకి వస్తున్న కొత్తవారికి గైడ్ గా ఉపయోగపడుతుంది. ఇప్పటికే సినీ రంగంలో ఉన్న వారికి దారిదీపం గా పనికొస్తుంది. సాధారణ పాఠకునికి సినిమాను ఎలా చదవాలో నేర్పుతుంది. చాలా మంది సినీ పెద్దలకు కోపం కూడా తెప్పిస్తుందనేది, హార్డ్ కోర్ అభిమానుల మనోభావాలను దెబ్బ తీస్తుందనేది కూడా నిజం. వందల కోట్ల ధనం పెట్టుబడిగా ఉన్న చోట సమాజ హితం అనేది ఒదుగుతుందా అనే ప్రశ్నకు ప్రసేన్ సమాధానం చెప్పాల్సుంటుంది కూడా.
మొత్తం మీద సినిమాను మరమ్మత్తు చేయాలని, ప్రజోపయోగకారిగా దాన్ని మార్చాలని ప్రసేన్ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. సినిమా విమర్శకు సంబందించి ప్రసేన్ @సినిమా ఒక ప్రామాణికం అవబోతోందన్నది నిజం. అలా అని ఇది సీరియస్ సిద్ధాంత గ్రంధం కానే కాదు.. సరదాగా చదివి ఆనందించ దగ్గ పుస్తకం కూడా. – ఎం డి అబ్దుల్