గానకోకిల, స్వరవాణి వాణీ జయరాం కన్నుమూత!

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. పద్మభూషణ్ అవార్డు గ్రహీత వాణీ జయరామ్ కన్నుమూశారు. కళాతపస్వీ దర్శకులు కె. విశ్వనాథ్  కన్నుమూసిన ఘటననుంచి ఇంకా తేరుకోకముందే  ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరామ్ అనారోగ్యంతో చెన్నైలో తన స్వగృహంలో  తుది శ్వాసవిడిచారు.  ఇటీవలే కేంద్రం ఆమెకు మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్‌తో గౌరవించింది.

ఈ  అవార్డు స్వీకరించక ముందే.. వాణీ జయరామ్ కన్నుమూయడంతో చిత్రసీమలో  విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె పాట సమ్మోహన పరుస్తుంది..పరవశింపచేస్తుంది..ఒక్కసారి వింటే తృప్తి కలగదు..మళ్లీ మళ్లీ అదే పాట వినాలనిపిస్తుంది…కోయిల కూసినట్టు, గలగలా గోదారి పరుగులు పెట్టినట్టు, గంగమ్మ ఉరకలెత్తి వచ్చినట్టు…ఆమె పాట అనేక భావాలను మోసుకొస్తుంది…తన గానమృతం తో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన ఆమె మరెవరో కాదు స్వర సరస్వతి వాణీ జయరాం. వాణీ జయరామ్ వాణీ..  పాటకు ప్రాణం పోస్తుంది ఆ గాత్రం, ఆ గాత్రం పాటకు ఆరో ప్రాణమే కాదు అలంకరణ  కూడా…మనసు పులకించేలా, తనువు పరవశించేలా ఉంటుంది ఆమె పాట. అటు దక్షిణాది నాలుగు భాషలతో పాటు హిందీ భాషల్లో కూడా తన సుమధుర గానంతో వాణీ జయరామ్  అలరించారు.

తెలుగుతో పాటు తమిళ్, కన్నడ ,మళయాలం, కన్నడ, ఒరియలతో పాటు  దాదాపు 14 భారతీయ భాషల్లోనూ 8 వేలకు పైగా పాటలు పాడిన ఘనత వాణీ జయరాం సొంతం. ఆ గానామృతమే ఆమెకు కోట్ల కొద్దీ అభిమానుల్ని సంపాదించిపెట్టాయి. పలు భాషల్లో అగ్ర సంగీత దర్శకులందరి దగ్గరా పాటలు పాడిన ఈ స్వర సరస్వతి…సౌత్ ఇండియా మీరాగా పేరు తెచ్చుకున్నారు.అభిమానవంతులు సినిమాలోని ఎప్పటివలె కాదురా నా స్వామి అనే పాటతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన వాణీ జయరాం..తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలను ఆలపించారు. శ్రోతలను అలరించారు. అందుకే ఆమె పాడిన ప్రతి పాటా ఓ ఆణిముత్యంలా ఆబాల గోపాలాన్ని అలరిస్తుంది. అటు సింహబలుడుతో ఈమె పాడిన సన్నజాజులోయ్.. కన్నమోజులోయ్ పాట మాస్ ప్రేక్షకులను సైతం అలరించింది.

ఉత్తమ గాయనీగా మూడు జాతీయ అవార్డులు అందుకున్న ఆమె సినీ ప్రస్థానం విషయానికొస్తే.. తెలుగు పాటకు పల్లకీ ఆమె గాత్రం… ఆమె గాత్రంలో అందమైన, అద్భుతమైన పాటలెన్నో ప్రాణం పోసుకున్నాయి. 1945 నవంబర్ 30న తమిళనాడులో వెల్లూరులో పుట్టిన వాణీజయరాం తల్లిద్వారా తెలుగు నేర్చుకున్నారు. తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన పేరు ‘కలైవాణి’. ఆరుగురు అక్కా చెల్లెలో ఆమె ఐదో సంతానం. తన ఎనిమిద ఏటనే సంగీత కచేరి నిర్వహించిన వాణీజయరాం. ముత్తస్వామి దీక్షితుల కీర్తనల ఆలాపనలో బాగా పాపులర్ అయింది. వాణీ   సాహిత్యంలోని లాలిత్యాన్ని,పా టలోని భావాన్ని ఒడిసిపట్టి అలవోకగా ఆలపించడం వాణీ జయరాం సొంతం. వాణీ జయరాం తల్లి గారు ప్రఖ్యాత వీణా విద్వాంసులు రంగ రామనుజ అయ్యంగార్ శిష్యురాలు..ఆమె కర్నూలులో పుట్టి పెరిగారు.

ఆ కారణంగానే వాణీ జయరాంకు తెలుగుమీద మంచి పట్టు వచ్చింది. అంతేకాదు సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం కావడం వల్ల చిన్నతనంలోనే సంగీతం మీద ఆసక్తీ ఏర్పడింది.  ఎనిమిదవ ఏటనే ఆలిండియా రేడియోలో పాట పాడి అబ్బుర పరిచిన బాలమేధావి. 1970లో మొదటి సారిగా సినిమాల్లో ప్లేబాక్ సింగర్ గా అరంగేట్రం చేశారు. గుడ్డి సినిమాలో పాడిన ‘బోల్ రే పపీ హరా‘ వాణీ జయరాం పాడిన మొదటి సినిమా పాట. ఈ పాటకు లయన్ ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రామిసింగ్ సింగర్, తాన్ సేన్ అవార్డులాంటి ఐదు అవార్డులు అందుకున్నారు. ఎంత కష్టమైన పాటనైనా అలవోకగా పాడే వాణీ జయరాంను మూడు సార్లు జాతీయ అవార్డులు వరించాయి..కే.బాల చందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ్ సినిమా అపూర్వ రాగంగల్ కు మొదటి సారి జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తరువాత రెండు అవార్డులూ తెలుగు సినిమా పాటలకే రావడం తెలుగు సినీ ఇండస్ట్రీ అదృష్టంగా చెప్పుకోవాలి.

అ రెండు సినిమాలు ఒకటి శంకరాభరణం, రెండోది స్వాతికిరణం. శంకరా భరణం చిత్రంలోని ‘దొరకునా ఇటువంటి సేవ’ పాటకు గానూ ఈ అవార్డు వరించింది. విశేషం ఏంటంటే ఈ రెండు సినిమాలకు దర్శకుడు  కె.విశ్వనాథ్ అయితే..స్వరాలు సమకూర్చింది కె.వి. మహదేవన్. తొలిసారి కే.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శంకరాభరణం’ చిత్రంలోని  1992 లో వచ్చిన స్వాతి కిరణం సినిమా సంగీత పరంగా పెద్ద హిట్…ఆ పాటలు తెలుగు సినిమా పాటల స్థాయిని పెంచాయి. వాణీజయరాంకూ మంచి గుర్తింపు తీసుకువచ్చయి. ఈ సినిమాలో వాణీ పాడిన ఆనతి నియరా…హరా…అనే పాటకు గాను మరో సారి  జాతీయ అవార్డును తీసుకున్నారు. సినిమా సంగీతం మాత్రమే సంగీతం కాదు అని గాఢంగా నమ్ముతారు వాణీ జయరాం. అందుకే సంగీతంలో శాస్త్రీయ, జానపద, లలిత సంగీతాలూ సంగీతమే అంటారు. అందుకే అనేక రకాల సంగీతాల్లో స్పెషలైజ్ చేశారు. భజన్స్, గజల్స్ ప్రోగ్రాములు చేశారు. సంగీత కచేరీలూ చేస్తారు. అందుకే శాస్త్రీయ సంగీతంలో పాడిన పాటలే కాదు..లలిత సంగీతంలో, వెస్ట్రన్ ఊపున్న పాటలూ ఆమె గాత్రంలో అలవోకగా ఇమిడిపోయాయి. అలా పాడిన పాటలే సీతాకోకచిలుక, ఘర్షణ సినిమాల్లోని పాటలు. మానస సంచరరే..బ్రహ్మణి మానస సంచరరే, దొరకునా ఇటువంటి సేవ లాంటి పాటలతో తెలుగులో తనదైన ముద్ర వేసుకున్నారు.

ఆ తరువాత నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్య క్రిష్ణయ్యా, ఈ రోజు మంచి రోజు మరపురానికి, మధురమైనది, ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ, నిన్నటి సూరీడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా…లాంటివి ఆమె పాడిన పాటల్లోని కొన్ని ఆణిముత్యాలు మాత్రమే.సినిమాల్లో పాడకపోతే బిజీగా లేనట్టు కాదు అనే వాణీ జయరాం స్పానిష్, జాస్ టైప్ శాస్త్రీయ సంగీతంతో దాదాపు ఏడు ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు. వీటితో పాటు స్టేజి షోలతోనూ ప్రేక్షకులను మైమరపింప జేస్తున్నారు. వాణీ జయరాం పాట అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ  ఎవర్ గ్రీన్ .. ఆ పాట జోల పాటై లాలిస్తుంది. మలయ మారుతమై ఉత్తేజ పరుస్తుంది, చల్లని పిల్లగాలిలా ఉత్సాహాన్ని ఇస్తుంది.

8 పదుల వయసుకు దగ్గర పడ్డ ఆమె గాత్రంలో ఎలాంటి మార్పూ లేదు. అందుకే అనేక భారతీయ భాషల్లో వేలాది పాటలు పాడి, సంగీతానికి భాష అడ్డురాదని నిరూపించిన విధుషీమణి వాణీ జయరాం. తాజాగా ఆమె కీర్తి కిరీటంలో పద్మభూషణ్ చేరింది.  ఆమె ఎప్పుడూ అవకాశాల వెంట పరిగెత్తలేదు..అలాగని వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు. ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుంది. అందమైన పాటలపూదోటను సృష్టించింది. ఆ గానకోకిల, స్వరవాణి వాణీ జయరాం మృతితో దక్షిణాది చిత్ర పరిశ్రమ మరో గానకోకిలను కోల్పోయింది.