ది కేరళ స్టోరీ సినిమాకి.. జాతీయ అవార్డులు రావడంపై.. సీఎం విజయన్ ఫైర్..!

71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో.. వివాదాస్పద చిత్రంగా నిలిచిన “ది కేరళ స్టోరీ” రెండు ప్రధాన విభాగాల్లో అవార్డులు గెలుచుకోవడం కేరళలో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఉత్తమ దర్శకుడు మరియు ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో ఈ సినిమా అవార్డులు అందుకోగా, కేవలం కొన్ని గంటల్లోనే కేరళ సీఎం పినరయి విజయన్ ఈ నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

విజయన్ అధికారికంగా ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ, “తప్పుడు సమాచారాన్ని ప్రోత్సహించే చిత్రాన్ని కేంద్ర ప్రభుత్వం సత్కరించడం వల్ల దేశ సమగ్రతకే భంగం కలుగుతుందని అన్నారు. కేరళను లవ్ జిహాద్, మతమార్పిడుల కేంద్రంగా చిత్రీకరించి, మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా చేసిన సినిమాకు అవార్డు ఇవ్వడం ద్వారా సంఘ్ పరివార్ భావజాలానికి చట్టబద్ధత కల్పిస్తున్నట్లు కేంద్రం వ్యవహరించిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

“ది కేరళ స్టోరీ” విడుదల సమయంలోనూ ఇటువంటి వివాదాలు వినిపించాయి. ఈ సినిమా మత మార్పిడుల పేరిట యువతను ఐసిస్ ఉగ్రవాద సంస్థలలో చేరుస్తున్నారనే ఇతివృత్తంతో సాగింది. నటుడు అదా శర్మ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాను దర్శకుడు సుదీప్తో సేన్ రూపొందించారు. విడుదల సమయంలో ఇది కేరళలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. ఇప్పుడు అదే సినిమా జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకోవడంతో కేరళ అధికార పార్టీ వామపక్షం తీవ్రంగా మండిపడుతోంది.

సీఎం విజయన్ వ్యాఖ్యలకు తోడుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వి. శివన్ కుట్టి కూడా స్పందిస్తూ, “ఇది జాతీయ చలనచిత్ర అవార్డుల విలువను దెబ్బతీసే నిర్ణయం. సినిమా వాస్తవాధారాలు లేని కథతో రూపొందించబడింది” అని వ్యాఖ్యానించారు. ఈ అవార్డులు కేవలం సినిమా రంగంలోనే కాదు, రాష్ట్ర ప్రతిష్ట, రాజకీయ భావజాలాల మధ్య విభేదాలకు ముద్ర వేసే అంశంగా మారాయి. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతీ ఒక్కరు తమ స్వరం వినిపించాలని, రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన సమయం ఇదే అని విజయన్ అన్నారు.