ఆయన మాటాడితే… ప్రతి మాట కవితవుతుంది

(మల్యాల పల్లంరాజు)

 

భారత ప్రధానులలో కవిగా, మహావక్తగా, హస్యచతురిడిగా  రాజనీతిజ్ఞుడుగా నిలిచింది వాజ్ పేయి ఒక్కరే.  అంతకు ముందు ప్రధానిగా వచ్చిన పివినరసింహారావు పండితుడిగా పేరుపొందారు. నరసింహారాావు రాజకీయాలలో ఆయన పాండిత్యం ప్రతిబింబిస్తూ వచ్చింది. వాజ పేయి ని చివరి దాకా ఆయనలోని కవి వదలిపోలేదు. ఆయన ఉపన్యాసాలన్నీ కవిత్వ దోరణిలో ఉంటాయి. పద్యం ప్రస్తావించకుండా ఆయన ప్రసంగం ఉండదు. ఆయన మనసు కవి.  కవితలను చెళుకుల్లా వాడి అవతలి వాళ్లను నిరాయుధం చేసే  శక్తి వాజ్ పేయి లో ఉంది. భారతరత్నే కాదు. కవిరత్న కూడా. వాజపేయి కవితలను  జలజం సత్యనారాయణ అనుసృజన చేశారు. ఇపుడా మహా కవికి నివాళి.

వాజపేయి రాజకీయ నిబద్ధత, సిద్ధాంతాల విషయంలో రాజీపడని మహా మేధావి. అందుకే తన కవితలో…

‘సర్ మిటాయింగే.. లేకిన్ సర్ ఝుకాయింగే నహీ..’ అంటారు.తలవంచం అన్న కవితలో…

షఒరిగి పోతాం… కానీ తలవంచం..

అధికారంతో సత్య సంఘర్షణ

నిరంకుశత్వంతో న్యాయపోరాటం.

అర్థరాత్రి అంధకారంలో సమరానికి పిలుపు

కిరణమే అంతిమ సమాధానమవుతుంది!

పందెంలో అన్నీ పణంగా పెట్టాం. ఇక ఆగేది లేదు

ఒరిగి పోతాం.. కానీ  తలవంచేదిలేదు..’

(1975 ఎమర్జన్సీ సమయంలో జైలులో రాసిన కవిత ఇది)

 

ఎంత ఎదిగినా..  ఒదిగి పోయే వాజపేయి మనస్థత్వానికి అద్దం పట్టిన మరో కవిత.

ఎంతో ఎదిగిపోతే… సహృదయులను ఆలింగనం చేసుకోవడానికి దూరమవుతానన్న ఆవేదన ఈ కవితలో వ్యక్తమవుతుంది.

 

‘హే ప్రభూ!  

నాకు ఇంతటి ఎత్తు ఎప్పుడూ ఇవ్వకు

ఇతరులను గుండెలకు హత్తుకోలేనంతగా

అంతటి హృదయ కాఠిన్యాన్ని ఎప్పుడూ నాకు ఇవ్వకు!’

 

భారత, భాగవతాలను ఆయన ఎంతగా ప్రేమించారో…

ధర్మరాజు జూదం అలవాటును అంతగా ద్వేషించారు.

ద్రౌపదిని  నిరుపేద స్త్రీతో సరిపోల్చుస్తూ.. మహిళలకు జరిగే అన్యాయాన్ని నిరసించారు.అందుకే

 

‘ధర్మరాజు కూడా  జూద మోహ క్రీడల్ని వదులుకోలేదు

అందుకే జూద పంకిలం అంటుకున్నది

ప్రతి న్యాయ పంచాయితీలో

పాంచాలి యైనా..

నిరుపేద యైనా…

అవమానితయే…ఫ

(ఇందుకు పరిష్కారం)

‘ఇప్పుడు కృష్ణుడు లేని మహా భారతం కావాలి!’ అని అభిలషిస్తారు.

 

‘గుర్తింపు’ అన్న కవితలో…

‘మనిషి గొప్పవాడూ కాడు..

నీచుడూ కాడు

పెద్దవాడూ కాడు

చిన్నవాడు కాడు…

మనిషి కేవలం మనిషి అవుతాడు …’ అంటారు.

 

ప్రధాని అయినా ఉగ్రవాదుల హింసాకాండకు చలించి పోయారు. కంటతడి పెట్టారు.

 

‘ఈ జీవనం కంటే

మృత్యువే మేలైంది

ఉగ్రవాదులు విధివీధిలో ఉన్నప్పుడు

అప్పుడప్పుడు నేను కూడా ఏడుస్తాను’ అంటారు. ’శరీరానికి కాపలా కాయవలసిన మనస్సు ఎక్కడికో పరిగెడుతుంది..’ అని వాపోతారు..

అదే ‘దీపాలు మళ్లీ వెలిగిద్దాం!’ అన్న కవితలో…

 

‘యజ్ఞం అసంపూర్ణంగా ఉంది. ఆహుతి మాత్రమే మిగిలింది..

నవ దధీచి అస్థికల్ని  కరిగించి

అంతిమ విజయానికి

వజ్రాయుధాన్ని తయారు చేద్దాం

రండి! మళ్లీ దీపాలు వెలిగిద్దాం!…’ అని ఉద్బోధిస్తారు.

 

సామూహిక అత్యాచారం ( గ్యాంగ్ రేప్) ఘటన వాజపేయి మనస్సును రగిలించివేసింది. అత్యాచారానికి గురైన బాలిక గుండెలోని ఆవేదన, ఆక్రోశం కవితలో ప్రతిబింబించింది.

 

‘అమ్మా!  నాకు బతకాలని ఉంది

నేను చివరిదాకా పోరాడుతాను

మానవుని ఊహకు అందలేనంతగా

ఈ శరీరాన్నీ, ఆత్మనీ, స్ఫూర్తినీ

మొక్కవోని ధైర్యంతో  నిలబెట్టండి!

వాళ్లు నా తల పగుల గొట్టనీ

అందులో పుర్రెని  ముక్కలు ముక్కలుగా చేయనీ,

నా ముఖం మీద ఎముకల్ని చితక గొట్టనీ

బలవంతంగా అత్యాచారం చేయనీ

ఉద్రేకంతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేయనీ

కానీ నా శరీరం, ఆత్మస్థైర్యం లొంగిపోరాదు.

నేను ఈ ఘర్షణలో ఓడిపోను…

ఇట్లా హీనమైన, నీచమైన వాటిని నేను ఎదురొడ్డి నిలవాలి..’ అంటారు.

 

దేశభక్తిలో సాటిలేని నాయకుడు  జమ్మూ పిలుస్తోంది అన్న కవితలో ఆయన ఆవేదన.

 

‘భరతమాత శిరచ్ఛేదన జరుగుతోంది.

మళ్లీ దేశం పునర్విభజన జరుగనున్నదా?

అందరి రక్తం నీళ్లలా ప్రవహించనున్నదా?

ఈ దానవ రాజ్యాన్ని మాయాజాలాన్ని జరగనివ్వాలా?

ఈ భస్మాసురుల మోసాన్ని కొనసాగనివ్వాలా?..’ అని నిలదీస్తారు.

‘ఇప్పుడు రక్తంతో కొత్త చరిత్ర రాయాలి

బలిపీఠం పై నిర్భయంగా పాదం మోపుదాం

రండి!..  ఖండిత భారత వాసులారా రండి!

కాశ్మీరం పిలుస్తోంది.. త్యాగధనులారా రండి…’ అని పిలుపు నిస్తారు.

 

అమెరికా, పాక్ ఒప్పందంపై  ఆగ్రహం వ్యక్తం చేస్తూ…

‘బెదిరింపుల జిహాద్ నినాదాలతో, ఆయుధాలతో

కాశ్మీర్ ను ఎప్పుడూ స్వాధీనం చేసుకోలేవు

యుద్ధాలతో, అత్యాచారాలతో, నరమేధంతో

భారత్ తలవంచుతుందని అనుకోకు

కాశ్మీరంలో భారత పతాకం ఎన్నడూ తలవంచుకోదు..

స్వతంత్ర  భారతం తలదించుకోదెప్పుడూ!…’ అని నినదించారు వాజపేయి.

 

కవితా సంపుటి పేరు ‘శిఖరం’.. ‘శిఖరం’ కవితలో

‘ఎత్తయిన పర్వతాలపై

చెట్లు ఎదగవు.. మొక్కలు మొలకెత్తవు

గడ్డి పరక కూడా పరుచుకోదు.

మంచు పొరలు మాత్రమే  పరచు కొంటాయి..

గాలిలో గోపురంలా ఒంటరిగా…

తనవాళ్లకు దూరంగా

శూన్యంలో ఏకాకిగా మిగిలిపోవడం..

పర్వతాల గొప్పతనం కానే కాదు..

అది కేవలం నిస్సహాయత’ (అని సమాజంలో ఎంతో ఎత్తుకు ఎదిగి, తనవాళ్లను పట్టించుకోని గొప్పోళ్లకు చురకలు అంటించారు వాజపేయి.)

 

అటల్ బిహారీ వాజపేయి కవితా వైభవాన్ని, శిల్ప సౌందర్యాన్ని విశ్లేషించడం అంటే.. సముద్రాన్ని ఔపోసన పట్టే ప్రయత్నమే. అంటారు జలజ సత్యనారాయణ తన ముందు మాటలో…

 

శిఖరం: అటల్ బిహారీ వాజపేయి కవిత్వం..

అనుసృజన: జలజం సత్యనారాయణ

సమీక్ష: మల్యాల పళ్లంరాజు, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్…