వక్ఫ్ భూములకు సంబంధించి కీలకమైన మార్పులతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు ఇప్పుడు చట్టంగా మారింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి ఈ బిల్లుపై సంతకం చేయడంతో, ఇది అధికారికంగా చట్టంగా మారి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ఈ చట్టంతో వక్ఫ్ భూముల నిర్వహణ, భద్రత, బాధ్యతల విషయంలో మరింత స్పష్టత కలిగే అవకాశం ఉందని కేంద్రం చెబుతోంది.
ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది ముస్లిం సంఘాలు దీనికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినప్పటికీ, మరికొన్ని సంఘాలు ఈ బిల్లును స్వాగతించాయి. వివాదాల నేపథ్యంలో కేంద్రం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేసి, వివిధ వర్గాల అభిప్రాయాలను స్వీకరించింది. ఆ ప్రక్రియలో కొన్ని కీలక సవరణలను బిల్లో చేర్చారు.
బడ్జెట్ సమావేశాల చివరిదశలో ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్రం, ఉభయ సభల్లో దీని మీద చర్చ నిర్వహించింది. చివరికి లోక్‌సభలో 288-232 ఓట్లతో, రాజ్యసభలో 128-95 ఓట్లతో ఈ బిల్లు ఆమోదం పొందింది. తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి పంపగా, ముర్ము ఆమోదంతో చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టంతో వక్ఫ్ భూములకు సంబంధించి వివాదాలు తగ్గుతాయని, వ్యవస్థ మరింత పారదర్శకత సంతరించుకుంటుందని అధికార వర్గాలు అంటున్నాయి.
ఇకపై వక్ఫ్ భూముల వినియోగం, దుర్వినియోగం వంటి అంశాల్లో కేంద్రానికి కొంత నియంత్రణ కలిగేలా మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే, స్థానిక వక్ఫ్ బోర్డులపై పర్యవేక్షణ, నియామకాల్లో సమన్వయం, ఆస్తుల రిజిస్ట్రేషన్ వంటి అంశాల్లో స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి. దేశంలో ముస్లింలకు సంబంధించిన ఆస్తుల పరిరక్షణకు ఇది దోహదం చేస్తుందని కేంద్రం అభిప్రాయపడుతోంది. అయితే దీని ప్రయోజనాలు ప్రజలకు ఎలా తగిలి పడతాయో.. త్వరలో తెలిసే అవకాశం ఉంది.