Supreme Court: భారత అత్యున్నత న్యాయస్థాన చరిత్రలో కొత్త రికార్డు..

భారత అత్యున్నత న్యాయస్థానం కొత్త శకానికి శ్రీకారం చుట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో రాజభవన్‌ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశం మొత్తం దృష్టి న్యాయపీఠంపై నిలిచింది. 52వ సీజేఐగా గవాయి ప్రమాణం చేయడం ద్వారా భారత న్యాయవ్యవస్థలో మరో కొత్త రికార్డుగా నిలిచింది.

ఎందుకంటే భారత ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టిన బౌద్ధ మతానికి చెందిన తొలి వ్యక్తిగా గవాయి గుర్తింపు పొందారు. దేశ న్యాయ వ్యవస్థలో సామాజిక సమత్వానికి ఇది ప్రతీకగా నిలుస్తోంది. మహారాష్ట్ర హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకు వచ్చిన ఆయన, గత నాలుగు దశాబ్దాలుగా న్యాయ రంగంలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

సమాజంలోని తక్కువ వర్గాల నుంచి ఉన్నతస్థాయిలోకి వచ్చిన వ్యక్తిగా గవాయి వ్యక్తిగత ప్రస్థానం ఎంతో ప్రేరణాత్మకం. న్యాయ పరంగా సామాన్యుడికి న్యాయం అందించాలన్న మిషన్‌ ఆయన సుప్రీంకోర్టులోనూ కొనసాగుతుందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కేసులు, న్యాయ వ్యవస్థను మరింత సులభతరం చేయడమే ఆయనకు సవాలుగా మారనున్నాయి. అటు ప్రభుత్వ విధానాలు – ఇటు ప్రజల హక్కుల మధ్య సంతులనం పాటించాల్సిన కీలకమైన బాధ్యతను గవాయి భుజాన వేసుకున్నారు.