విద్యార్ధులకు శుభవార్త

లక్షలాది మంది విద్యార్దులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అనేక ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, ఇతర కోర్సుల కళాశాలలు విద్యార్దులను జాయిన్ చేసుకునే సమయంలో విద్యార్ధుల ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుంటారు. ఆ తర్వాత వారికి అవసరం ఉన్నా ఇవ్వకుండా కాలేజి యాజమాన్యాలు వేధిస్తుంటాయి.

కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్

ఇక కాలేజిల ఆట సాగదు, విద్యార్దుల ఒరిజినల్స్ తీసుకునే హక్కు మీకు లేదంటూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కళాశాలలను ఆదేశించారు.

వివిధ కోర్సుల్లో చేరిన విద్యార్థినీవిద్యార్థుల ఒరిజినల్‌ ధ్రువపత్రాలను తమ వద్ద అట్టేపెట్టుకోవద్దని విశ్వవిద్యాలయాలు, కళాశాలలను యూజీసీ హెచ్చరించింది. ఒకవేళ విద్యార్థి తన అడ్మిషన్‌ను రద్దు చేసుకున్న పక్షంలో అతనికి లేదా ఆమెకు నిబంధనల ప్రకారం ఫీజు వాపస్‌ చేయాలని కూడా ఆదేశించింది. ఈ ఆదేశాలను అమలుచేయకపోతే ఉన్నత విద్యా సంస్థలపై యూజీసీ చర్యలు తీసుకుంటుందని హెచ్చార్డీ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ మీడియాకు తెలిపారు.

ఆయా విద్యా సంస్థలకు అఫిలియేషన్‌, డీమ్డ్‌ హోదాను ఉపసంహరించుకుంటామని, యూజీసీ నుంచి అందే సాయాన్ని ఆపివేస్తామని ఆయన స్పష్టం చేశారు. ‘‘కోర్సుకు అడ్మిషన్‌ఫారం దాఖలు చేసే సమయంలో విద్యార్థి మార్కుల సర్టిఫికెట్‌, స్కూలు లీవింగ్‌ సర్టిఫికెట్‌ వంటి విద్యాపరమైన, వ్యక్తిగతమైన ఎలాంటి ఒరిజినల్‌ సర్టిఫికెట్లూ సమర్పించనవసరం లేదు. ఏ విద్యాసంస్థా విద్యార్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లను తమ స్వాధీనంలో ఉంచుకోరాదు. స్వీయ ధ్రువపత్రం ఇస్తూ ఆయా సర్టిఫికెట్ల నకళ్లను మాత్రమే విద్యా సంస్థలు తీసుకోవాలి’’ అని జావడేకర్‌ తెలిపారు.

 ప్రకటించిన అడ్మిషన్‌ చివరితేదీ కన్నా 15 రోజులు ముందుగానే విద్యార్థి తన అడ్మిషన్‌ను ఉపసంహరించుకుంటే అతను లేదా ఆమె చెల్లించిన ఫీజు మొత్తం వాపస్‌ ఇవ్వాల్సిందేనని మంత్రి చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో కొన్ని కళాశాలలు ప్రాసెసింగ్‌ ఫీజును మినహాయించుకున్నా…విద్యార్థి చెల్లించిన మొత్తంలో గరిష్ఠంగా 5 శాతం, (లేదా 5 వేలు లోపు) మాత్రమే మినహాయించుకోవాల్సి ఉంటుంది.

అడ్మిషన్‌ చివరితేదీకి 15 రోజుల్లోపులో విద్యార్థి తన అడ్మిషన్‌ను ఉపసంహరించుకుంటే అతనికి 90 శాతం ఫీజు రీఫండ్‌ చేయాలి. చివరితేదీ ముగిసిన 15 రోజుల్లోపు అడ్మిషన్‌ వాపస్‌ తీసుకుంటే 80 శాతం ఫీజు, 16 నుంచి 30 రోజుల్లోపు వాపస్‌ తీసుకుంటే విద్యార్థికి 50 శాతం ఫీజు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు కాలేజిల యాజమాన్యాలు ఎంత వరకు అమలు చేస్తాయోనని అంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫీజులు చెల్లింపు అయ్యే వరకు సర్టిఫికెట్స్ ఇవ్వకుండా వేధించే కాలేజిలు దీనిని అమలు పరుస్తాయో లేదోనని విద్యార్దులు అంటున్నారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహారిస్తే ఖచ్చితంగా దీనిని అమలు పరుచవచ్చని పలువురు అంటున్నారు.

కళాశాలలపై ఫిర్యాదులు చేసేందుకు యూనివర్సిటి అధికారులకు ముందుగా ఫిర్యాదు చేయాలని వారు స్పందించకపోతే నేరుగా కేంద్ర మానవ వనరుల శాఖకు ఫిర్యాదు చేయాలన్నారు. అప్పుడు కళాశాలతో పాటుగా నిర్లక్ష్యం వహించిన యూనివర్సిటి అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.