Debt Management: అప్పుల వేధింపులకు చెక్ పెట్టేలా కేంద్రం ప్లాన్

రుణదాతల వేధింపుల కారణంగా వరుస ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోన్ యాప్‌లను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం రూపొందిస్తోంది. ఈ చట్టం ప్రకారం, అనుమతులు లేకుండా రుణాలు ఇచ్చే వ్యక్తులు లేదా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇందులో 10 సంవత్సరాల జైలు శిక్ష లేదా కోటి రూపాయల జరిమానా విధించే ప్రతిపాదనలను చేర్చారు.

2021లో ఆర్బీఐ వర్కింగ్ గ్రూపు ఆర్థిక మోసాలను అరికట్టే చర్యలను సూచించగా, కేంద్రం ఆ నివేదిక ఆధారంగా కొత్త బిల్లును తయారుచేసింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రుణాలు అందించే అనధికారిక యాప్‌లకు పూర్తిగా చెక్ పెట్టేందుకు ఈ చట్టం కీలకంగా మారనుంది. కుటుంబసభ్యులకు ఇచ్చే రుణాలను మినహాయించి, అన్ని ఇతర రుణాలను నియంత్రించేలా ఈ చట్టం రూపొందించబడింది.

రుణ గ్రహీతలను వేధించే విధానాలను పూర్తిగా నిలిపివేయడం ఈ చట్టంలోని ప్రధాన లక్ష్యం. రుణాలు తిరిగి వసూలు చేసే సమయంలో అనైతిక పద్ధతులను అనుసరించేవారిపై మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలు విధించనున్నారు. రుణదాతలు, రుణగ్రహీతల మధ్య జరిగే వ్యవహారాలు నైతికత, పారదర్శకతతో కొనసాగాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ముసాయిదా బిల్లుపై 2025 ఫిబ్రవరి 13 నాటికి ప్రజల అభిప్రాయాలను స్వీకరించనున్నారు. బిల్లులో పొందుపరిచిన నిబంధనలను కఠినంగా అమలు చేస్తే, రుణ గ్రహీతల రక్షణ పెరగడంతో పాటు, రుణదాతల మోసాలు పూర్తిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ కొత్త చట్టం మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందా అనేది చూడాల్సి ఉంది.