ఉండవల్లి మాటలు నిజమవుతున్నాయి… ఏ-1, ఏ-2 మరింత ఇరుక్కుంటున్నారా?

గతకొంతకాలంగా చర్చనీయాంశమైన మార్గదర్శి అక్రమాలు కేసుకు సంబంధించి దర్యాప్తు మరింత కీలక మలుపు తీసుకుందని తెలుస్తుంది. ఈ వ్యవహారంలో ఉండవల్లి చేసిన ఆరోపణలు అన్నీ వాస్తవాలని తెలిసే సమయం ఆసన్నమైందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి!

అవును… మార్గదర్శిలో బ్లాక్ మనీ ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పదేపదే ఆరోపించిన సంగతి తెలిసిందే. మార్గదర్శిలో జరుగుతున్న మోసాలు, చట్ట ఉల్లంఘనలను మొట్టమొదట బయటపెట్టిందే ఉండవల్లి. మార్గదర్శికి వ్యతిరేకంగా ఉండవల్లి సుమారు 17 ఏళ్ళుగా న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు. ఆయన ఒంటరి పోరాటానికి చాలాకాలం ఏ కోణంలో కూడా మద్దతు దొరకకపోయినప్పటికీ… సడెన్‌ గా ఏపీ ప్రభుత్వం మద్దతుగా నిలిచింది.

ఈ సమయంలో మార్గదర్శిలో మనీల్యాండరింగ్ జరుగుతోందని సీఐడీ అనుమానిస్తోందని తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా సంపాదించిందని సమాచారం. ఈ నేపథ్యంలో… మార్గదర్శిలో కోటి రూపాయలకు మించి డిపాజిట్లు వేసిన ఖాతాదారులకు సీఐడీ నోటీసులు జారీ చేసిందని తెలుస్తుంది.

అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్‌ డెరెక్ట్ ట్యాక్సెస్ (సీడీబీటీ) నిబంధనల ప్రకారమే… కోటి రూపాయలు డిపాజిట్ చేసిన ఖాతాదారులను విచారణకు రావాల్సిందిగా సీఐడీ నోటీసులు జారీ చేయడం గమనార్హం. అయితే ఈ లిస్ట్ లో ఎంతమంది ఉన్నారనే విషయం సీఐడీ అధికారులు చెప్పకపోయినా… కోటి రూపాయలు డిపాజిట్ చేసి, విచారణకు రానివారంతా ఆర్బీఐ రూల్స్ ను అతిక్రమించి నల్లధనాన్ని డిపాజిట్ చేసినట్లుగా సీఐడీ నిర్ధారణకు రావొచ్చనే కామెంట్లూ వినిపిస్తున్నాయి!!

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మార్గదర్శిలో కోటి రూపాయలు డిపాజిట్ చేయటం అంటే మామూలు విషయంకాదనేది చాలా మంది అభిప్రాయంగా ఉంది. మధ్య, ఎగువ మధ్య తరగతి జనాలు లక్షల రూపాయలకు మించి డిపాజిట్లు చేయడం అంత ఈజీ కాదనేది మరికొంతమంది చెబుతున్న మాటగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఏకంగా కోటి రూపాయలు డిపాజిట్ చేయటంపై సీఐడీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లుందని తెలుస్తుంది.

ఈ కారణం చేతనే మార్గదర్శి చిట్ ఫండ్స్ రూపంలో నల్లధనం చెలామణి అవుతోందని ఉండవల్లి ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే కోటి రూపాయలు డిపాజిట్ చేసిన వాళ్ళందరు విచారణకు హాజరైతే అసలు విషయాలు బయటపడతాయని అంటున్నారు.

దీంతో… మనీల్యాండరింగ్, నల్లధనం ఆరోపణల అసలు విషయాలు అప్పుడు వెలుగుచూస్తాయని.. అదే జరిగితే రామోజీ, శైలజ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు! ఏది ఏమైనా… వీలైనంత తొందర్లో ఈ విషయం ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు పరిశీలకులు!