Ghani Movie Review :
రేటింగ్ : 2.25/5
రచన – దర్శకత్వం : కిరణ్ కొర్రపాటి
తారాగణం : వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్, నదియా, తమన్నా, జగపతి బాబు, ఉపేంద్ర సునీల్ శెట్టి, నరేష్, తనికెళ్ళ, సత్యా తదితరులు
సంగీతం : తమన్,
ఛాయాగ్రహణం : జార్జ్ విలియమ్స్,
యాక్షన్ : మాస్టర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్
బ్యానర్స్ : రెనసాన్స్ ఫిలిమ్స్, అల్లు బాబీ కంపెనీ
నిర్మాతలు : అల్లు బాబీ, సిద్ధు ముద్దా
విడుదల : ఏప్రెల్ 8, 2022
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ దాదాపు మూడేళ్ళ తర్వాత ప్రేక్షకుల ముందు కొచ్చాడు. బాక్సింగ్ పాత్ర కోసం బాడీ బిల్డింగ్, ట్రైనింగ్ వగైరాలకి బుక్కయిపోయి- మధ్య మధ్యలో కోవిడ్ అవాంతరాలతో మేకింగ్ ఆలస్యమై, మళ్ళీ విడుదలకి భారీ సినిమాలతో పోటీ వాతావరణమేర్పడి – మొత్తానికి ఈ వారం ‘ఘని’ కి మోక్షం ప్రసాదించాడు.
సీనియర్ కోడైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకుడుగా పరిచయమయ్యాడు. బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాని తెరకెక్కించాడు. స్పోర్ట్స్ డ్రామాని కొత్తగా తెరకెక్కించడాని కేముంటుంది.
ఏమీ వుండదా? ఎందుకుండదు? వుంటే ఎలావుంటుంది? ఈ విషయం చూద్దాం…
కథ
2004 లో విక్రమాదిత్య (ఉపేంద్ర) బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఓడిపోతాడు. స్టెరాయిడ్స్ అధిక మోతాదులో తీసుకోవడంతో చనిపోతాడు. దీంతో అతడి కొడుకు గని (వరుణ్ తేజ్) ని తోటి పిల్లలు చీటర్ కొడుకువని వేధిస్తారు.
తల్లి మాధురి (నదియా) అతణ్ణి తీసుకుని వైజాగ్ వచ్చేస్తుంది. మొక్కల పెంపకం కార్యక్రమం నడుపుతూ గనిని చదివిస్తుంది.
గని బాక్సింగ్ వైపు వెళ్ళకూడదని మాట తీసుకుంటుంది. కానీ ఇంజనీరింగ్ చదువుతున్న గని తల్లికి తెలియకుండా కోచ్ (నరేష్) సాయంతో బాక్సింగ్ నేర్చుకుని, పోటీల్లో పాల్గొంటూ వుంటాడు. ఈ క్రమంలో కాలేజీ మేట్ మాయా (సయీ మంజ్రేకర్) అతణ్ణి ప్రేమిస్తుంది.
ఇక గని జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటూ విజేంద్ర సిన్హా (సునీల్ శెట్టి) దృష్టిలో పడతాడు. వెంటనే గనిని కలుసుకుని, ఆనాడు ఛాంపియన్ షిప్ లో గని తండ్రికి తానే బాక్సింగ్ ప్రత్యర్ధి నని చెప్పి,
గని తండ్రి ఓడిపోవడానికీ, స్టెరాయిడ్స్ వాడి చనిపోవడానికీ అతడి మిత్రుడు ఈశ్వర్ నాథ్ (జగపతి బాబు) కారణమని వెల్లడిస్తాడు సిన్హా.
ఎవరీ ఈశ్వర్ నాథ్? గని తండ్రి విక్రమాదిత్య మీద ఎందుకు కుట్ర చేసి చంపాడు? ఇప్పుడతను ఇండియన్ బాక్సింగ్ లీగ్ స్థాపించి, అదే సమయంలో బెట్టింగ్ సిండికేట్ నడుపుతున్నాడు.
బెట్టింగ్ కీ, గని తండ్రిని చంపడానికీ సంబంధముందా? ఇతడి కుట్ర తెలుసుకున్న గని బాక్సింగ్ తోనే ఇతడికెలా బుద్ధి చెప్పాడు? చీటర్ గా తండ్రి మీద పడ్డ మచ్చని ఎలా రూపుమాపి, తల్లి వేదననని తీర్చాడు? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగతా కథ.
ఎలావుంది కథ
రెగ్యులర్ స్పోర్ట్స్ జానర్ టెంప్లెట్ కథకి కుటుంబ కథ మేళవించి మూస ఫార్ములా డ్రామా చేశారు. సీనియర్ కో డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి 15,20 ఏళ్ళ క్రిందటి తను పనిచేసిన సినిమాల ప్రభావంతో ఈ ఔట్ డేటెడ్ మూవీ తీసినట్టు అర్ధమవుతోంది.
తన తప్పేం లేదు. ఈ కథ హీరోకీ నిర్మాతలకీ నచ్చాక, తనని తప్పుబట్టడానికి వీల్లేదు. అయితే కొత్త దర్శకుడుగా దర్శకత్వం మీద ఇంత పట్టు నిరూపించుకున్న తను, బాక్సింగ్ తో కొత్త కథ తీసుకుని వచ్చి వుంటే బావుండేది.
ఒక వైపు బాక్సింగ్ కి ఆదరణ లేదనీ, ఒలింపిక్స్ లో ఒక్క పతకం కూడా సాధించేలేదనీ పాత్ర ద్వారా చెప్పించినప్పుడు, ఈ మాటల్లోనే కొత్త సినిమా కథ వుంది.
బాక్సింగ్ అకాడెమీ ప్రారంభించి యువతని బాక్సర్లుగా తయారు చేయాలన్న హీరో తండ్రి ఆశయం గురించి చెప్పడంలోనే, కొత్త స్పోర్ట్స్ కథ వుంది.
హీరో తండ్రి ఆశయం కోసం పనిచేస్తూ బాక్సింగ్ వైపు యూత్ ని మళ్ళించే, ఒలింపిక్స్ కి వూరించే, యూత్ అప్పీల్ వున్న కథగా వుంటే- మరో ‘చక్ ఇండియా’ గా సంచలన ప్రయోజనాత్మక పురస్కార గ్రహీత సినిమా అయ్యేది.
హీరో, నిర్మాతలు మార్కెట్ యాస్పెక్ట్ లేని పాత మూస ఫార్ములా డ్రామాలకి పడిపోయి – యూత్ అప్పీలున్న హీరోతో యూత్ కి ఒలింపిక్స్ అంత దూరాన వుండిపోయే ఫార్ములా స్పోర్ట్స్ సినిమా తీసి ఔరా అన్పించారు.
యూత్ కి క్రీడల పట్ల అనురక్తి కల్గించని, ప్రోత్సాహమివ్వని స్పోర్ట్స్ సినిమాలు తీసి దండగ! ప్రభుత్వాలు స్పోర్ట్స్ ని ప్రోత్సహించడంలేదని చెబుతూనే స్పోర్ట్స్ సినిమాలు మాత్రం చేస్తున్న పనేంటి. స్పోర్ట్స్ సినిమా చూస్తున్నప్పుడు దీంతో మనమేం చేయగల
మన్న యాక్షన్ ఓరియెంటెడ్ కళ్ళతో యూత్ చూసే అవకాశముంది. యూత్ కి ఏం చూపించినా – ఇందులో నాకేంటి? – అన్న దృష్టితో చూస్తారు.
కలియుగం యాక్షన్లో వున్నప్పుడు పాసివ్ డ్రామాలతో పని జరగదు. యాక్షన్- యాక్షన్- యూత్ కి ఏం టాస్క్ ఇస్తున్నాం, ఇదే స్కోరు చేస్తుంది స్పోర్ట్స్ కథకి. మిగతాదంతా సోదియే.
నటనలు- సాంకేతికాలు
వరుణ్ తేజ్ టాలెంటెడ్ నటుడని ‘కంచె’ తోనే నిరూపణ అయింది. ‘గని’ లో ఇది ప్రూవ్ చేసుకున్నాడు. బాక్సర్ పాత్ర కోసం బాడీ బిల్డింగ్ చేసి బాక్సింగ్ దృశ్యాలు రక్తి కట్టించాడు. ఒక్క క్లయిమాక్స్ లో ప్రత్యర్ధిని ఓడించే బాక్సింగ్ అనుకున్నంత పీక్ కి వెళ్ళకుండానే డ్రాప్ అయి ముగిసిపోవడం తప్ప.
వాడు తనని ఆ యెత్తున పంచులిచ్చి రక్తం కళ్ళ జూసినప్పుడు, తను వాడి ఒళ్ళంతా రక్తం చేసి ప్రేక్షకుల కచ్చి తీర్చకూడదా? కొట్టు ఇంకా కొట్టు అని ప్రేక్షకులు అరవలేదంటే ఏం కొట్టుడది? ఫారిన్ యాక్షన్ డైరెక్టర్లకి తెలుగు కొట్టుడు గురించి తెలీనట్టుంది.
వరుణ్ తేజ్ బాక్సర్ పాత్ర నటించడంలో మునిగిపోయి, ఆ పాత్ర కివ్వాల్సిన ఇమేజి బిల్డప్ మర్చిపోయినట్టుంది. ‘ఎటాక్’ లో సూపర్ సోల్జర్ గా జాన్ అబ్రహాం పాత్ర నటిస్తూ, కనీసం విలన్ కి కూడా తను సూపర్ సోల్జర్ అని తెలీని పాత్ర చిత్రణ చేసినట్టు.
వరుణ్ తేజ్ ఆఖరికి బాక్సర్ గా ఢిల్లీ ఈవెంట్ కెళ్ళినప్పుడైనా, జాతీయస్థాయిలో బాక్సర్ గా కవరేజీ లేకపోతే ఎలా? బరిలో అతడి స్టేటస్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది?
ఇక వరుణ్ తేజ్ మదర్ నుంచి దాస్తూ బాక్సింగ్ లో ఎదిగే క్రమంలో, మదర్ తో సెంటిమెంటల్ డ్రామా విషయంలో దర్శకుడు, మాటల రచయిత అబ్బూరి రవి ఉత్తీర్ణులయ్యారు.
అలాగే విలన్ జగపతి బాబుతో వరుణ్ తేజ్ రివెంజీ తీర్చుకునే క్రమం కూడా కూల్ గా, మెచ్యూర్డ్ గా నటించాడు. వరుణ్ తేజ్ లో సహజ నటుడున్నాడు. నటించాల్సింది ఇలాటి సినిమాలు కాదు.
ఫ్యామిలీస్ కోసమని కూడా ఈ స్పోర్ట్స్ వయోలెంట్ యాక్షన్లో ఫ్యామిలీ డ్రామా క్రియేట్ చేశారు గానీ- అసలు యూత్ కోసమే యూత్ ఓరియెంటెడ్ గా స్పోర్ట్స్ మూవీ తీస్తే, తమ యూత్ నెలా పెంచుకోవాలో చూడ్డానికి ఫ్యామిలీస్ వస్తారు. ఇది యూత్ ఓరియెంటెడ్ ప్రపంచం ఐనందువల్ల.
పోతే వరుణ్ కి సయీ మంజ్రేకర్ తో జూనియర్ కాలేజీ అప్పట్నుంచీ ఆ లవ్ ఎందుకో అర్ధంగాదు. దర్శకుడు, అబ్బూరి రవి ఎంత హాస్యాస్పదం చేయాలో అంతా చేశారు.
సయీ మంజ్రేకర్ ఫస్టాఫ్ లో రోమియో కి జూలియెట్ గా కన్పించింది కాస్తా, మళ్ళీ సెకండాఫ్ ముగుస్తున్నప్పుడు క్లయిమాక్స్ లోనే కన్పించేది వరుణ్ బాక్సింగ్ ని టీవీలో ఎంజాయ్ చేస్తూ. అంత జూలియెట్ అయినప్పుడు వరుణ్ తో ఢిల్లీ ఈవెంట్ కి ఎందుకు వెళ్ళలేదో అర్ధంగాదు.
టాలెంటెడ్ నదియా కూడా ఫుల్ లెన్త్ కీలక పాత్ర బాగా నటించింది మదర్ గా. సెకండాఫ్ లో ఒక ఉద్విగ్న సన్నివేశంలో తానూ- సునీల్ శెట్టీ పరస్పరం చేతులు జోడించి నమస్కారం పెట్టుకోవడం కదిలించే దృశ్యం. మూవీ మొత్తానికి ఇదే హైలైట్.
వరుణ్ తండ్రిగా కన్నడ ఉపేంద్ర సెకండాఫ్ 20 నిమిషాలు ఫ్లాష్ బ్యాక్ లో వస్తాడు. యూత్ ని బాక్సర్స్ గా తీర్చి దిద్దాలన్న ఆశయముండే సాత్విక పాత్ర. నీటుగా నటించాడు.
అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి ఉపేంద్ర ప్రత్యర్ధి పాత్రలో, తర్వాత పశ్చాత్తాపంతో వరుణ్ మిత్రుడుగా మారే పాత్రలో హూందాగా నటించాడు. జగపతి బాబు ఉపేంద్ర మిత్రుడుగా వుంటూ, మిత్ర ద్రోహిగా మారే మెయిన్ విలన్ పాత్ర డీసెంట్ గా పోషించాడు.
వరుణ్ ప్రత్యర్ధి నవీన్ చంద్ర కూడా మిత్రుడుగా మారిపోతాడు. శత్రువులు మిత్రులుగా, మిత్రులు శత్రువులుగా మారిపోయే పాత్రలే రిపీటెడ్ గా ఈ మూడూ. పోతే బాక్సింగ్ కోచ్ కి నరేష్ సరిపోలేదు. సత్యా ఒక సీన్లో కామెడీ చేసి, మిగిలిన సీన్లలో ఫ్రేముల్ని ఫిలప్ చేస్తూ నిలబడతాడు. తనికెళ్ళ హీరోయిన్ తండ్రి.
ఇక క్లయిమాక్స్ ఈవెంట్ లో సడెన్ గా తమన్నా వచ్చి పాట పాడుతుంది. తమన్ సంగీతం టైటిల్స్ దగ్గర్నుంచే ఒకే లెవెల్లో చాలా లౌడ్ గా వుంది.
టైటిల్స్ తో ఫీల్ తో ప్రారంభమై, ఆ ఫీల్ ని కొనసాగిస్తూ, క్రమంగా వేగం పెంచుకుంటూ పోతే అదో సౌండ్ డిజైన్ గా వుండేది. ఛాయాగ్రహణం డిమ్ లైటింగ్ వాడారు, రిచ్ గా వుండేలా చూశారు.
ప్రొడక్షన్ విలువల కోసం భారీగానే ఖర్చు పెట్టారు. ఫారిన్ యాక్షన్ డైరెక్టర్ లు బాక్సింగ్ కోసం మరీ అంతగా కృషి ఏమీ చేయలేదు. వాళ్ళ ముద్రేమీ కన్పించలేదు.
చివరికేమిటి
తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునే ఫ్యామిలీ డ్రామా ఫార్ములాకి స్పోర్ట్స్ జానర్ కథ అనుకున్న ఫలితాన్ని సాధించలేదు. ఫస్టాఫ్ పూర్తిగా లవ్ ట్రాక్ తో డొల్లగా వుంది.
ఈ లవ్ కూడా కథకి ఉపయోగపడలేదు. ఫస్టాఫ్ హీరో ఫ్యామిలీ, లవ్ సీన్లతో గంటా 15 నిమిషాలూ విషయం లేదు. అక్కడక్కడ హీరో లోకల్ ఈవెంట్స్ లో పాల్గొనే దృశ్యాలు.
ఇంటర్వెల్లో సునీల్ శెట్టి వచ్చి హీరో తండ్రి గురించి చెప్పినప్పుడు అది సెకండాఫ్ ప్రారంభంలో ఫ్లాష్ బ్యాక్ కి దారి తీస్తుంది. ఫస్టాఫ్ కథ లేకపోవడంతో స్క్రీన్ ప్లేకి స్ట్రక్చర్ లేదు.
ఏమాట కామాటే చెప్పుకుంటే, ఈ మధ్య చాలా వరసగా వస్తున్న సినిమాలు సెకండాఫ్ కథలేక, వున్నా చేసుకోలేక ఫ్లాపవుతున్నాయి. ‘గని’ దీనికి రివర్స్ లో ఫస్టాఫ్ లో కథ లేకపోయినా సెకండాఫ్ లో కథ వుంది! ఆ సెకండాఫ్ చెప్పాలనుకున్న రివెంజీ కథని నీటుగా చెప్పారు.
అయితే ఎంత నీటుగా చెప్పినా ఈ ప్రతీకార- కుటుంబ బాధల కథ పాత కథే. నటీ నటులందరి చేత మంచి నటనని రాబట్టుకున్నాడు దర్శకుడు కూడా. అయితే మాత్రం ఈ పాత ఫ్యాషన్ కథ మాత్రం స్పోర్ట్స్ మూవీకి అతకలేదు.
దర్శకుడు ఈ పాత లోంచి బయటి కొచ్చి యూత్ కథల్ని యూత్ దృక్కోణంలో సినిమాలు తీస్తే తప్ప మనుగడ కష్టం. వేరే రెగ్యులర్ మసాలా మాస్ యాక్షన్లు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
—సికిందర్