Chiranjeevi: మెగా వారసుడొచ్చాడు.. ఆనందంలో చిరంజీవి

chiranjeevi

Megastar Chiranjeevi: మెగా కుటుంబంలోకి మూడో తరం వారసుడొచ్చాడు. ఎంతో కాలంగా వారసుడు కోసం ఎదురుచూస్తున్న మెగా కుటుంబం లోటు ఎట్టకేలకు భర్తీ అయింది. వారసుడు రాకతో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి జంటకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ సంగతి తెలుసుకున్న చిరంజీవి ఆసుపత్రికి వెళ్లి మరీ బాబును చూసి సంతోషంతో ఉబ్బితబ్బిపోయారు. మెగా వారసుడిని చేతులతో ఎత్తుకుని మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

కొణిదెల కుటుంబంలోకి ఇప్పుడే పుట్టిన బాబుకు స్వాగతం అని పేర్కొన్నారు. వరుణ్ తేజ్, లావణ్య తల్లితండ్రులు అయినందుకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బ్రదర్ నాగబాబు, పద్మజలు తాత, నాన్నమ్మగా ప్రమోట్ అయినందుకు సంతోషంగా ఉందన్నారు. బేబీ బాయ్ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ మెగా ఇంటి బాబుపై అభిమానుల ప్రేమ, ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలి అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట మూడో తరంలో తొలి వారసుడిగా వరుణ్ తేజ్ కుమారుడు నిలిచాడు. అంతకుముందు చిరు తనయుడు రామ్‌చరణ్ దంపతులకు అమ్మాయి పుట్టింది. దీంతో వరుణ్ కుమారుడు మూడో తరం మెగా వారసుడిగా నిలిచాడు. వారసుడి రాకతో మెగా కుటుంబంలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా మెగా కుటుంబంలోకి వారసుడు రావడంపై సినీ ప్రముఖులతో పాటు అభిమానులు వరుణ్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

కాగా వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిలు 2023లో వివాహం చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల పాటు ప్రేమించుకున్న ఇరువురు పెద్దల సమక్షంలో ఓ ఇంటి వారయ్యారు. ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డబుల్ హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలో నటిస్తున్నారు. ఫుల్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే వరుణ్‌ తేజ్ యువ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో హీరోగా ‘కొరియన్ కనకరాజు’ అనే సినిమా చేస్తున్నారు. మరోవైపు లావణ్య త్రిపాఠి కూడా తమిళ హీరో అథర్వాతో కలిసి ‘టన్నెల్’ సినిమాలో నటించింది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.