HomeMovie Reviewsప్రశ్నించే పవర్ -'కౌసల్యా కృష్ణమూర్తి' మూవీ రివ్యూ

ప్రశ్నించే పవర్ -‘కౌసల్యా కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ

ప్రశ్నించే పవర్ – ‘కౌసల్యా కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ!

రీమేకుల రాజా భీమనేని శ్రీనివాస రావు తన 12 వ రీమేకుగా ‘కౌసల్యా కృష్ణమూర్తి’ అనే స్పోర్ట్స్ డ్రామాతో ఈ వారం థియేటర్లని పలకరించారు. ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ ద్వారా ఈ రీమేకులో ఒక కొత్త తరహా క్రియేటివిటీని ప్రదర్శించారు. క్రికెట్లో వ్యవసాయంతో బాటు, రీమేకులో డబ్బింగ్ కూడా చూపించారు. ఈ మధ్య ఓ మూడు స్పోర్ట్స్ డ్రామాలు వచ్చాయి గానీ, హీరోయిన్ ప్రధానమైన స్పోర్ట్స్ డ్రామా రాలేదు. తమిళ ఒరిజినల్లో నటించిన హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ తెలుగులో కూడా నటిస్తూ, పురుష క్రీడా ప్రపంచమైన క్రికెట్లో క్రీడాకారిణిగా రాణించే బాణీని ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో ఈ కథెలా వుందో చూద్దాం…

కథ
Images 1 3 | Telugu Rajyam
వ్యవసాయదారుడైన కృష్ణమూర్తి (రాజేంద్రప్రసాద్) కి క్రికెట్ పిచ్చి. ఇండియా ఓడిపోయినప్పుడల్లా కన్నీళ్లు పెట్టుకుంటాడు. భార్య (ఝాన్సీ), కూతురు కౌసల్య (ఐశ్వర్యా రాజేష్) వుంటారు. ఒకరోజు తండ్రి అలా కన్నీళ్లు పెట్టుకోవడాన్ని గమనించిన కౌసల్య, ఎలాగైనా తను క్రికెటర్ అయి ఇండియాని గెలిపించి తండ్రి కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని నిర్ణయించుకుంటుంది. ఈ విషయం ఇంట్లో చెప్పలేక, బయట క్రికెట్ ఆడే అమ్మాయిల్లేక, అబ్బాయిలతో ఆడుతూంటుంది. ఎదిగాక కూడా అబ్బాయిలతో ఈ ఆటలు చూసి వూళ్ళో వాళ్ళు చెవులు కొరుక్కోవడంతో తల్లి ఇంట్లో నిర్బంధిస్తుంది. కానీ కృష్ణమూర్తి ప్రోత్సహిస్తాడు. అయితే అతడి వ్యవసాయం నష్టాల పాలై ఆర్ధిక సమస్యలు చుట్టుముడతాయి. కౌసల్య ఎలాగో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి క్రికెట్లో నెగ్గినా, ఆ పైన ఇండియా తరపు ఆడేందుకు తండ్రి దుస్థితి ఆమెని మానసికంగా కుంగదీస్తుంది. ఈ పరిస్థితిలో ఆమెకి అండగా నిలిచిందెవరు, చివరికామె క్రికెట్ తో తండ్రి కళ్ళల్లో ఆనందాన్ని ఎలా చూసిందన్నది మిగతా కథ.

ఎలావుంది కథ
Images 2 2 | Telugu Rajyam
ఇంతవరకూ వచ్చిన స్పోర్ట్స్ సినిమాలు వేరు, ఇది వేరు. ఇంతవరకూ వచ్చిన స్పోర్ట్స్ సినిమాలు స్పోర్ట్స్ కోసమే వున్నాయి. ఇది వ్యవసాయంతో స్పోర్ట్స్ కోసం వుంది. ఇంతవరకూ వచ్చినవి సామాజికంగా ఏ నేపథ్యమూ లేని అండర్ డాగ్స్ విజయాలుగా వచ్చాయి. ఇది వ్యవసాయ కుటుంబం నుంచి ఒక క్రీడాకారుడు కాదు, ఏకంగా చిన్నచూపుకు గురయ్యే క్రీడాకారిణి వస్తే ఏంటి పరిస్థితి అని చూపెడుతోంది. ఒక పక్క ఓ క్రీడాకారిణి జాతీయ, అంతర్జాతీయ స్థాయులకి ఎదుగుతోంటే, రైతు అయిన ఆమె తండ్రి వ్యవసాయంలో నష్టపోయి బాకీ పడ్డాడని ఇల్లు జప్తు చేసే అవమానంతోబాటు, మానసిక స్థైర్యానికి విఘాతం కల్గించే చర్యలకి వ్యవస్థ పూనుకోవడాన్ని డైలాగులతో ఖండించలేదుగానీ, సబ్ టెక్స్ట్ తో మనం ఫేలయ్యేలా చేశారు.

చివరికామె కూడా తనలాంటి క్రీడాకారుల దైన్యం గురించి చెప్పుకోదు. మొత్తం వ్యవసాయ రంగం గురించే చెప్తుంది. క్రికెట్ లో ఓడిపోయినప్పుడల్లా గెలిపించడాకి ఎవరో ఒకరు వస్తున్నారు, వ్యవసాయంలో ఓడిపోతున్న రైతుల్ని గెలిపించడానికి ఎవరొస్తున్నారని.

ఈ కథలో ఇదివరకు లేని వెంటాడే ప్రశ్నలున్నాయి. కాబట్టి ఈ స్పోర్ట్స్ డ్రామా మిగతా అన్నిటికంటే బలమైనది.

ఎవరెలా చేశారు
Images 6 | Telugu Rajyam
తెలుగు ప్రేక్షకులకి తెలియని తెలుగు అమ్మాయి ఐశ్వర్య తమిళంలో 36 సినిమాల నటి. మరో 12 రానున్నాయి. ఈ రీమేక్ తో తొలిసారిగా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈమె ఈ రిమేక్ నిలబెట్టే పాత్ర చాలా సింపుల్ గా, నిరాడంబరంగా నటించింది. స్పోర్ట్స్ సినిమాల్లో సాధారణంగా వుండే హైప్, మాస్ ఓరియెంటెడ్ యాక్షన్, హీరోయినిజం వగైరా లేకుండా రియలిస్టిక్ గా పాత్ర పోషణ చేసింది. ఈ పాత్ర లక్ష్యానికి ప్రేమా దోమా అడ్డురాకుండా క్లీన్ గా వుంది. ఆమె పెద్ద అందగత్తె కాకపోవడం వ్యవసాయ నేపథ్యంతో వున్న గ్రామీణ పాత్రకి కలిసొచ్చింది.

ఇక తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్ కి మంచి పాత్రే దొరికింది. మంచి నటన చేశాడు. అయితే సర్దార్జీలా ఆ గడ్డమెందుకో అర్ధంగాదు. ఛానెల్ కోసం హిందీ డబ్బింగ్ వాళ్ళు తీసుకోవడానికేమో. తల్లి పాత్రలోఝాన్సీ కూడా తన సహజ ధోరణిలో నటించింది. ఇక సెకండాఫ్ లో కోచ్ గా వచ్చే తమిళ స్టార్ శివకార్తికేయన్ ఏకంగా డబ్బింగై వచ్చేశాడు. తమిళంలో తను నటించిన పార్టుని డబ్బింగ్ చేసి పెట్టేశారు. రీమేక్ కి కూడా షార్ట్ కట్స్ ఎలా వుంటాయో యంగ్ మేకర్లకి ఒక గైడ్ గా అందించారు.

ఇక అప్పుడపుడు వచ్చే సహాయ పాత్రల్లో చాలా మందే వున్నారు. సాంకేతికాలు, సంగీత సాహిత్యాలు, కళాదర్శకత్వాలు, క్రికెట్ మ్యాచ్ కోరియోగ్రఫీ అన్నీ బడ్జెట్ ప్రకారం వున్నాయి.

చివరికేమిటి
తండ్రి వ్యవసాయం – తనయ క్రికెట్… ఈ రెండు ట్రాకుల కథనంలో తండ్రి ట్రాకు తనయ మానసిక సంఘర్షణ – అంటే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ని బలీయం చేసే ఉద్దేశంతోనే వుంది. రైతుల కష్టాలు తెలిసినవే. కానీ రైతు కుటుంబాలనుంచి వచ్చే క్రీడాకారుల వెతలు తెలియనివి. ఈ నేపథ్యంలో మేసేజిలివ్వడంగా గాక, ప్రశ్నలు రేకెత్తించడంగా రూపొందిన ఈ డిఫరెంట్ స్పోర్ట్స్ సినిమాని, తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తే బావుంటుంది.

 

ద‌ర్శ‌క‌త్వం: భీమ‌నేని శ్రీనివాస‌రావు
తారాగానం : ఐశ్వర్యా రాజేష్‌, రాజేంద్రప్రసాద్‌, ఝాన్సీ, సి.వి.ఎల్‌.నరసింహారావు, శివకార్తికేయన్‌, వెన్నెల కిశోర్‌, మహేష్ తదితరులు
క‌థ‌: అరుణ్ రాజ్ కామ‌రాజ్‌< సంగీతం: దిబు నిన‌న్‌, ఛాయాగ్రహణం: ఐ.అండ్రూ
స‌మ‌ర్ప‌ణ‌: కె.ఎస్‌.రామారావ
బ్యాన‌ర్: క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌
నిర్మాత‌: కె.ఎ.వ‌ల్ల‌భ‌
విడుదల : ఆగస్టు 23, 2019
3 / 5

―సికిందర్

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News