ప్రముఖ నటి ఇంట్లో చోరికి పాల్పడిన దొంగలు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

సాధారణంగా తాళాలు వేసిన ఇల్లు కనిపించగానే దొంగలు వారి చేతికి పని చెబుతుంటారు. సామాన్యుల ఇళ్లలోనే కాకుండా సెలబ్రిటీల ఇళ్లల్లో కూడా అప్పుడప్పుడు దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. సెలబ్రిటీల ఇళ్ళకి ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా దొంగలు మాత్రం చాలా చాకచక్యంగా ఇంట్లోకి చొరబడి ఉన్నది మొత్తం ఉడ్చుకుపోతున్నారు. తాజాగా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన వినయ ప్రసాద్ ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మర్యాదరామన్న, ఇంద్ర వంటి ఎన్నో సినిమాలో తల్లి, అత్త వంటి పాత్రలలో నటించి మంచి గుర్తింపు పొందిన వినయ ప్రసాద్ తెలుగుతో పాటు తమిళ,కన్నడ భాషలలో కూడా ఎన్నో సినిమాలలో నటించింది.

కన్నడ ఇండస్ట్రీకి చెందిన వినయ గతంలో హీరోయిన్గా కూడా నటించి మంచి గుర్తింపు పొందింది. ఇక ప్రస్తుతం ఈమె సినిమాలతో పాటు సీరియల్ లో కూడా నటిస్తోంది. వినయ ప్రసాద్ ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరులో నివాసం ఉంటుంది. ఇదిలా ఉండగా దీపావళి పండుగ సందర్భంగా వినయ తన భర్తతో కలిసి ఉడిపికి వెళ్ళింది. ఇంటికి తాళాలు వేసి ఉండటం గమనించిన దొంగలు అదే అదునుగా భావించి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. వారు తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు బద్దలు కొట్టి లాకర్ లో ఉన్న డబ్బు మొత్తం మాయం చేశారు. దీంతో వినయ కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

దొంగతనం గురించి ఫిర్యాదు అందుకున్న పోలీసులు నటి ఇంటికి వెళ్లి పరిశీలించి ఆధారాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వినయ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దొంగతనం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు . ఇంట్లో దొంగతనానికి పాల్పడిన దొంగలు లాకర్లో ఉన్న డబ్బు మొత్తం పట్టుకెళ్ళినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ డబ్బు ఎంత ఉంటుంది అన్న వివరాల గురించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఎంతో సెక్యూరిటీ ఉన్న ఇంట్లోనే ఇలా దొంగతనం జరగటంతో చుట్టుపక్కల వారు అప్రమత్తం అయ్యారని తెలుస్తోంది.