Prithvi Shaw: 2025 ఐపీఎల్ వేలంలో టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో క్రికెట్ ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. 75 లక్షల బేస్ ప్రైస్‌తో వేలానికి వచ్చిన షాను ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు. 2018లో అండర్-19 వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్‌గానే కాకుండా, భవిష్యత్తు భారత క్రికెట్‌కు కీలక ఆటగాడిగా భావించిన షా, గత రెండు ఐపీఎల్ సీజన్లలో తన ఫామ్ కోల్పోవడంతో జట్టు యాజమాన్యాల నుంచి మద్దతు కోల్పోయాడు.
గత సీజన్లలో నిలకడ లేమి, ఫిట్‌నెస్ సమస్యలు షా కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. అంతే కాకుండా సరైన క్రమశిక్షణ లేకపోవడంతో చాలా సార్లు అతనిపై కంప్లైంట్స్ వచ్చాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన షా, జట్టును నిరాశపరిచాడని భావించి వేలంలో పెట్టినప్పటికీ, అతడిని తిరిగి సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు. ఈ పరిణామం షా కెరీర్‌కు పెద్ద ఎదురు దెబ్బగా మారింది.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు, “షా ప్రతిభగల ఆటగాడు, కానీ అతడి ఫిట్‌నెస్‌పై నిర్లక్ష్యం అతడికి కొంపముంచింది. ఈ సమయంలో అతడికి ఆత్మపరిశీలన అవసరం,” అని పేర్కొన్నారు. షా పై తొలినుంచి భారీ అంచనాలు ఉండటం అతడికి ఒత్తిడిగా మారిందని అభిప్రాయపడ్డారు. సచిన్, లారా వంటి దిగ్గజాలతో పోల్చడం అతడి ఎదుగుదలకు అడ్డుపడిందన్నారు.
పృథ్వీ షా క్రికెట్‌కు తిరిగి రావాలంటే తన ప్రతిభను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. “ఇలాంటి సమయంలోనే ఆటగాళ్లు తమలో కొత్త శక్తిని వెలికితీసుకుంటారు. అతడు ఈ అవమానాన్ని ఆత్మవిశ్వాసంగా మార్చుకుంటే, క్రికెట్‌లో తిరిగి వెలుగులు చూడగలడు,” అని ఆశాభావం వ్యక్తం చేశారు. షా జీవితంలో ఈ పరిస్థితి ఆటగాడి నిర్లక్ష్యానికి గుణపాఠం కావాలని నిపుణులు భావిస్తున్నారు. కష్టపడితే క్రికెట్‌లో తిరిగి మెరిసే అవకాశాలు లేకపోలేదు. కానీ ఈ మెరుపు ఎంత త్వరగా వస్తుందన్నది అతడి కృషిపై ఆధారపడి ఉంది.