నిత్య సినీవిద్యార్థి సత్యానంద్‌ .. అభినందనలు తెలిపిన మెగాస్టార్!

పాపులర్‌ డైలాగ్‌, స్కిప్ట్‌ రైటర్‌ సత్యానంద్‌ రచయితగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో విజయవంతంగా 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు. 1973లో సూపర్‌ స్టార్‌ కృష్ణ ఐకానిక్‌ సినిమా ఆదుర్తి సుబ్బారావు డైరెక్ట్‌ చేసిన ‘మాయదారి మల్లిగాడు’తో అసిస్టెంట్‌ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ రైటర్‌గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు సత్యానంద్‌.

సత్యానంద్‌ మెమొరబుల్‌ గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. భావోద్వేగ సందేశాన్ని అందరితో పంచుకున్నాడు మెగాస్టార్‌ చిరంజీవి. ప్రియ మిత్రులు.. నాకు అత్యంత ఆప్తులు, మృదు భాషి , సౌమ్యులు, సత్యానంద్‌ తన సినీ ప్రస్థానంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు నా హృదయ పూర్వక ఆత్మీయ శుభాకాంక్షలు. ఆయనతో నా వ్యక్తిగత అనుబంధం, నేను నటించిన చాలా చిత్రాల్లో ఆయన పోషించిన పాత్ర ఎంతో ప్రగాఢమైనది.

ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలకి స్కిప్ట్‌ సమకూర్చి, పదునైన డైలాగ్స్‌ రాసి, మరెన్నో చిత్రాలకు స్కిప్ట్‌ డాక్టర్‌గా వుంటూ , ఎంతో మంది నేటి రచయితలకు, దర్శకులకు , నటులకు ఒక మెంటార్‌గా, గైడింగ్ , ఫోర్స్‌గా, గొప్ప సపోర్ట్‌ సిస్టమ్‌గా వుంటూ.. సినిమాను ప్రేమిస్తూ , సినిమానే ఆస్వాదిస్తూ , సినిమాని తన జీవన విధానం గా మలచుకున్న నిత్య సినీవిద్యార్ధి, తరతరాల సినీ ప్రముఖులనీదరికీ..మీరిలాగే మీ సినీ పరిజ్ఞానాన్ని , సినీ ప్రేమని, అందరికీ పంచుతూ, మరెన్నో చిత్రాల విజయాలకు సంధాన కర్తగా, మరో అర్ధ శతాబ్దంపాటు ఇంతే ఎనర్జీతో ఉండాలని ఆశిస్తున్నానని సుదీర్ఘ సందేశాన్ని పోస్ట్‌ చేశారు.

తన సోదరులు నాగబాబు, పవన్‌ కల్యాణ్‌తో కలిసి సత్యానంద్‌తో దిగిన ఫొటోతోపాటు మరో స్టిల్‌ను ట్వీట్‌ చేశారు మెగాస్టార్‌ చిరంజీవి. ఇప్పుడీ త్రోబ్యాక్‌ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. చిరంజీవి నటించిన కొండవీటి సింహం, అభిలాష, యముడికి మొగుడుతోపాటు పలు చిత్రాలకు రైటర్‌గా పనిచేశారు సత్యానంద్. పవన్‌ కల్యాణ్‌ నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రానికి కూడా పనిచేశారు.