ఇటీవల వచ్చిన రజనీకాంత్ ’జైలర్’లో విలన్ పక్కన కీలక పాత్రలో నటించిన కోలీవుడ్ నటుడు, డైరెక్టర్ అయిన మారిముత్తు (58) శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఓ టీవీ సీరియల్‌కు డబ్బింగ్ చెబుతూ.. ఆయన సడెన్‌గా కుప్పకూలిపోయినట్లుగా తెలుస్తోంది. వెంటనే అక్కడున్న సిబ్బంది ఆస్పత్రికి తరలించగా అప్పటికే మారిముత్తు కన్నుమూసినట్లుగా వైద్యులు గుర్తించారని సమాచారం.
మారిముత్తు ప్రస్తుతం చేస్తున్న ’ఎథిర్ నీచెల్’ అనే టీవీ సీరియల్‌కు డబ్బింగ్ చెప్పడానికి శుక్రవారం ఉదయం డబ్బింగ్ స్టూడియోకు వచ్చారని, డబ్బింగ్ చెబుతూనే గుండెపోటుతో కుప్పకూలిపోయారని.. డబ్బింగ్ స్టూడియో సిబ్బంది చెబుతున్నారు. జి. మారిముత్తు ఇప్పటి వరకు వందకుపైగా సినిమాల్లో నటించారు. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఇలా అనేక రకాల పాత్రలలో ప్రేక్షకులని అలరించారు.
అజిత్ హీరోగా ఎస్‌జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ’వాలి’సినిమాతో నటుడిగా అరంగేట్రం చేసిన మారిముత్తు.. రీసెంట్‌గా వచ్చిన రజనీకాంత్ ’జైలర్’ సినిమాలో విలన్‌కు నమ్మినబంటు పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆయన కమల్‌హాసన్ ’ఇండియన్ 2’లోనూ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.
మారిముత్తు స్వతహాగా దర్శకుడు కూడా కావడంతో నటుడిగా మంచి గుర్తింపును పొందుతున్నారు. కోలీవుడ్ డైరెక్టర్స్ ఆయన కోసం ప్రత్యేకంగా పాత్రలు క్రియేట్ చేస్తున్నారంటే.. మారిముత్తు నటనకున్న క్రేజ్ ఎలాంటిదో తెలుసుకోవచ్చు.