‘హనుమాన్‌’కు బాలయ్య అభినందన!

ప్రశాంత్‌ వర్మ ఏ ముహుర్తానా పట్టుబట్టి ‘హనుమాన్‌’ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేశాడో గానీ.. సినిమా విడుదలైన మరుక్షణం నుంచి ప్రపంచవ్యాప్తంగా అప్రతిహతంగా దూసుకెళుతూ మరోసారి తెలుగోడి సత్తాను వెలుగెత్తి చాటేలా చేస్తోంది. తాజాగా అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ చిత్రాన్ని వీక్షించి ఎంతగానో ప్రశంసించారు. అద్భుతంగా ఉందంటూ చిత్రబృందాన్ని ఆకాశానికి ఎత్తారు. సినిమాను చూసిన వారు ఆకాశానికెత్తెస్తూ.. నటుల యాక్టింగ్‌కు, దర్శకుని ప్రతిభకు చేతులెత్తి నమస్కరి స్తున్నారు.

ఈ చిత్రాన్ని చూసి బాలీవుడ్‌ నేర్చుకోవాల్సింది చాలా ఉందంటున్నారు. టాలీవుడ్‌ యువ హీరో తేజ సజ్జా నటించిన తొలి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ హనుమాన్‌. తొలి తెలుగు సూపర్‌ హీరో సిరీస్‌గా ప్రశాంత్‌వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ‘హనుమాన్‌’ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

కాగా ‘హనుమాన్‌’ స్పెషల్‌ స్క్రీనింగ్‌కు హీరో నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. అద్భుతమైన సినిమా తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్‌ వర్మపై ప్రశంసలు కురిపించారు బాలకృష్ణ. ఈ సందర్భంగా బాలకృష్ణ, ప్రశాంత్‌ వర్మ, నిర్మాత నిరంజన్‌ రెడ్డి దిగిన ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. గౌరా హరి-అనుదీప్‌ దేవ్‌, కృష్ణ సౌరభ్‌ సంయుక్తంగా అందించిన మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. హాలీవుడ్‌ స్థాయిలో డిజైన్‌ చేసిన విజువల్స్‌ సినిమాను ఆసక్తికరంగా మలిచాయి.

టాలీవుడ్‌ తో పాటుగా బాలీవుడ్‌ లో, ఓవర్సీస్‌ లలో బాహుబలి సినిమాను బీట్‌ చేస్తూ రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టి ట్రేడ్‌ పండితులను సైతం ఆశ్చర్య పరుస్తోంది. రిలీజైన నాలుగు రోజుల్లో 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఔరా.. అనిపించింది. తాజాగా ఈ సినిమాను కన్నడ స్టార్‌ హీరోలు శివరాజ్‌ కూమార్‌, రిషబ్‌ షెట్టి, ధనుంజయ.. తమిళ ఇండస్టీ నుంచి రాధిక, శరత్‌ కుమార్‌.. బాలీవుడ్‌ నుంచి మాధవన్‌, వివేక్‌ అగ్నిహోత్రి.. మళయాళ పరిశ్రమ నుంచి ఉన్ని ముకుందన్‌.. టాలీవుడ్‌ నుంచి బాలకృష్ణ, రవితేజ, రామ్‌ పోతినేని, మంచు విష్ణు, నారా రోహిత్‌, గోపీచంద్‌,ఆర్జీవీ, సాయిధరమ్‌ తేజ్‌, నాని, వరుణ్‌ తేజ్‌, రాఘవేంద్రరావు వంటి హీరోలు, దర్శకులు చిత్రయూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

బాలకృష్ణ ప్రత్యేకంగా షో వేయించుకుని మరి సినిమా తిలకించి ప్రశాంత్‌ వర్మను పొగడ్తల్లో ముంచెత్తారు. ఇక విదేశాల్లో సైతం ఈ సినిమా రికార్డు కలెక్షన్లను రాబడుతున్నది. ఉత్తర అమెరికాలో 3 మిలియన్ల డాలర్ల వసూళ్లను దాటింది. అక్కడ మొదటి వారాంతంలో ఆర్‌ఆర్‌ఆర్‌, బాహుబలి, సలార్‌ రికార్డులను దాటేయడం విశేషం.

అమెరికాలో లాంగ్న్‌ల్రో ఈ చిత్రం 5 మిలియన్‌ డాలర్ల వసూళ్లను దాటొచ్చని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం అనూహ్య వసూళ్లతో సంక్రాంతి విజేతగా నిలిచిందని విశ్లేషకులు చెబుతున్నారు. భారతీయ తొలి ఒరిజినల్‌ సూపర్‌ హీరో ఫిల్మ్‌గా ‘హనుమాన్‌’కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రాబోవు రోజుల్లో ఈ సినిమాకు మరిన్ని థియేటర్‌లు అందుబాటులోకి రానున్నాయని సమాచారం.