పొట్టి వృక్షాలతో గట్టి వ్యాపారం, అదేమిటో లలితశ్రీ చెబుతారు

(సుమబాల)

 

హైదరాబాద్, ఖాజాగూడలో ఉన్న శ్రీ బొన్సాయ్ నర్సరీకి వెడితే ఏదో మీనియేచర్ లోకంలో విహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మహావృక్షాలన్నీ ఒద్దికగా ఒదిగి ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. ఒకటి కాదు రెండు కాదు 500రకాలకు చెందిన మూడువేల మహావృక్షాలు బొన్సాయ్ మొక్కలుగా మారి బుద్దిమంతులైన స్కూలు పిల్లల్లా బారులు తీరి కనిపిస్తాయి. దీని వెనుక 30 ఏళ్ల శ్రమ ఉంది. ఓపిక ఉంది. ఆసక్తి ఉంది. నిబద్ధత ఉంది. వీటన్నింటి కేరాఫ్ అడ్రస్ అయిన లలితశ్రీ ఉన్నారు.

ట్రీ ఇన్ ట్రే

లలితశ్రీ పొట్టి వృక్షాలతో గట్టి ప్రతిభ కనబరుస్తున్న వ్యాపార కెరటం. బొన్సాయ్ రంగంలో హైదరాబాద్ లోనే కాదు ఏసియాలోనే మొట్టమొదటి బొన్సాయ్ నర్సరీ వ్యవస్థాపకురాలిగా దేశ, విదేశాల్లో పేరుపొందారు. వరల్డ్ బొన్సాయ్ కాంటెస్టులో  ప్రైజులతో పాటు స్టేట్ నుండి బెస్ట్ బొన్సాయ్ ఆర్టిస్టు, బెస్ట్ డిస్ ప్లే అవార్డులతో పాటు 2015, 2016 సం.లో రాష్ట్రంనుండి పద్మశ్రీ కినామినేట్ అయ్యారు లలితశ్రీ.

 

2500సం.ల పూర్వపు కళ అయిన బొన్సాయ్ కళలో ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్  లలితశ్రీ. విద్యార్థులకు థియరీ నేర్పించడమే కాదు ప్రాక్టికల్స్ కూడా చెబుతారు. బొన్సాయ్ లో సర్టిఫికెట్ కోర్స్ చెబుతారు. దీనివల్ల విదేశాల్లోని నర్సరీల్లో చేసే అవకాశమూ ఉంటుంది. లలితశ్రీ బోర్డ్ ఆఫ్ ఇండియన్ స్టడీస్ కమిటీలో మెంబర్గా బొన్సాయ్ సిలబస్ సెట్ చేస్తారు.

నేచర్ ఇన్ మీనియేచర్

మర్రి, రావి, జువ్వి, చింత, మామిడి, సపోటాలాంటి ఎన్నో చెట్లు ఇక్కడ కనిపిస్తాయి. బొన్సాయ్ ట్రేలతో పాటు ప్రీ బొన్సాయ్ మెటీరియల్, ఎరువులు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. 

18 సంవత్సరాల చింతచెట్టు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఈ ఏడు పదిహేను కిలోల దిగుబడి ఇచ్చింది  ఈ చింతచెట్టు. ఖాజాగూడలో శ్రీ బొన్సాయ్ కి వెడితే ఈ అద్భుతాలను మీరూ చూడవచ్చు.

షార్ట్ కట్స్ లేవు

బొన్సాయ్ మేకింగ్ అంటే షార్ట్ కట్స్ ఉండవు. ఏళ్ల తరబడి వేచి చూడాల్సిందే. అలా ట్రయల్ అండ్ ఎర్రర్ బెసీస్ లో మూడు దశాబ్దాల క్రితం మొదలైంది లలిత ప్రయాణం. మొట్టమొదటిసారిగా 1994లో పబ్లిక్ గార్డెన్స్ లో బొన్సాయ్ ఎగ్జిబిషన్లో తన బొన్సాయ్ పెట్టడం, అది అందరి దృష్టిని ఆకర్షించడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు లలిత. ఆ తర్వాత 1996నుండి పబ్లిక్ గార్డెన్ లో బొన్సాయ్ మేకింగ్ లో క్లాసులు తీసుకునే అవకాశం రావడం మొదటి అచీవ్ మెంట్ అంటారామె. ఆ తర్వాత హోం సైన్స్ కాలేజీలో, ఆంధ్రమహిళా సభ, సెంట్ ఫ్రాన్సిస్, సెంట్ జోసఫ్, లా కాలేజ్, రెడ్డీ కాలేజ్, మెరీడియన్, ఓబుల్ రెడ్డి…ఇలా అనేక స్కూళ్లు, కాలేజీల్లో బొన్సాయ్ తరగతులు తీసుకుంటూ సంవత్సరానికి వెయ్యికి పైగా విద్యార్థులకు బొన్సాయ్ ని పరిచయం చేస్తున్నారు.