అమెరిక‌న్ల‌కు క‌నువిందు చేయ‌బోయే సూప‌ర్ బ్ల‌డ్ వూల్ఫ్ మూన్‌

`సూప‌ర్ బ్లడ్ వూల్ఫ్ మూన్‌`. పెద్ద‌గా తెలియ‌ని పేరు బ్ల‌డ్ మూన్‌, బ్లూ మూన్ పేర్ల‌ను విన్నాం, చూశాం. గానీ మ‌ధ్య‌లో వూల్ఫ్ అనే ప‌దం ఆస‌క్తిని రేపుతోంది. సంపూర్ణ చంద్రగ్రహణం నాడు ఇది సంభ‌విస్తుంది. సంపూర్ణ గ్ర‌హణం స‌మ‌యంలో చంద్రుడు న‌ల్ల‌గా మారిపోతాడు. ఆకాశంలో ఉన్నాడా? లేడా అనే అనుమానాన్ని క‌ల‌గ‌జేస్తాడు.

బ్ల‌డ్ వూల్ఫ్ మూన్ మాత్రం దీనికి భిన్నం. సంపూర్ణ గ్ర‌హ‌ణం స‌మ‌యంలో చంద్రుడు ఎర్ర‌గా మారిపోతాడు. ఎరుపు, నారింజ రంగులో మెరిసిపోతాడు. అదొక్క‌టే కాదు- ఏడాది ఆరంభంలో అంటే..జ‌న‌వ‌రిలో వ‌చ్చే తొలి పౌర్ణ‌మిని పాశ్చాత్య దేశాల్లో వూల్ఫ్ మూన్‌గానే ప‌రిగ‌ణిస్తారు. చ‌లికాలంలో చివ‌రిరోజుల్లో ఈ గ్ర‌హ‌ణం సంభ‌విస్తుండ‌టం కూడా ఈ పేరు రావ‌డానికి ఓ కార‌ణ‌మ‌ట‌.

ఈ సంపూర్ణ చంద్ర గ్ర‌హ‌ణం మ‌న‌దేశంలో క‌నిపించ‌దు. ఉత్త‌ర అమెరికా, సెంట్ర‌ల్ అమెరికా, ద‌క్షిణ అమెరికా, ఐరోపా ఖండంలోని కొన్ని దేశాల్లో ఈ గ్ర‌హ‌ణం క‌నిపిస్తుంది. ఈస్ట‌ర్న్ టైమ్‌జోన్ (ఈటీ) ప్ర‌కారం..ఆదివారం రాత్రి 11:41 నిమిషాల‌కు గ్ర‌హణం ఆరంభమౌతుంది. 62 నిమిషాల పాటు సంపూర్ణ గ్రహణం కనువిందు చేస్తుంది. గ్రహణ కాలం మొత్తం మూడున్న‌ర‌ గంటలపాటు కొనసాగుతుంది.